భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం నాడు సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎల్ సీ కవిత పాల్గొని మాట్లాడుతూ బండి సంజయ్ మాటలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని అని కవిత ప్రశ్నించారు. కిందస్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే కదా అని నిలదీశారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు అని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదని ధ్వజమెత్తారు. పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారని చెప్పారు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలని అంటున్నారని అన్నారు. తాను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్నానని, మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు.. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడాలని చెప్పారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరు చెబుతున్న రాజ్యాంగ విలువలు ముందు ఇక్కడ కాపాడాలని హితవు పలికారు. కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్‌లో మతకల్లోహాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆసిఫాబాద్‌లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని చెప్పారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం గానీ అందలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు కనీసం అటు వైపు చూడలేదని మండిపడ్డారు.. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని కవిత ఆరోపించారు.
బండి సంజయ్ మాటలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయి : ఎంఎల్ సీ కవిత !
January 26, 2025
0
Tags