ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో వీఎంఆర్‌డీఏకు చెందిన ఐకానిక్ భవన సముదాయాన్ని సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. నగరం నడిబొడ్డున నౌక ఆకారంలో 11 అంతస్తుల్లో బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్ సదుపాయం (ఎంఎల్‌సీపీ) నిర్మిస్తున్నారు. ఇందులో ఐదు అంతస్తుల్లో 1.90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పార్కింగ్‌కు, ఆరు అంతస్తుల్లోని 1.65 లక్షల చదరపు అడుగులను కార్యాలయ అవసరాలకు ఉపయోగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్ వసతులతో అందుబాటులోకి తెచ్చిన ఈ భవనాన్ని గాలి, వెలుతురు వచ్చేలా, సుందరంగా కనిపించేలా అద్దాలతో నిర్మించారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్, డేటా ఇంక్యుబేషన్ సెంటర్లకు వీలుగా సువిశాల ప్రాంగణాలు సిద్ధంగా ఉండటంతో ఈ భవనం మొత్తాన్నీ జీసీసీలకు, బహుళ జాతి సంస్థలకు కేటాయించాలనే ఆలోచన ఉంది. వెంటనే కార్యకలాపాలు ఆరంభించి, యువతకు ఉపాధి కల్పించే పేరున్న సంస్థ కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురుచూస్తోంది. నగరం మధ్యలో భవనం ఉండటంతో ప్రముఖ సంస్థలు వస్తే ఒక బ్రాండింగ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. దావోస్‌లో సీఎం పర్యటన ముగియడంతో దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
విశాఖలో 'ఐటీకి' 11 అంతస్తుల ఐకానిక్ భవనం సిద్ధం !
January 24, 2025
0
Tags