గన్నవరంలో 58032 మద్యం బాటిళ్ల ధ్వంసం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీ నేతలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన మద్యాన్ని ఇటీవల పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గన్నవరం మండలం మెట్టపల్లి గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పట్టుబడిన 58032 మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై జరిగిన బాటిల్స్ ధ్వంసం కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అద్వాన్ అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ & గన్నవరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, నూజివీడు డీఎస్పీ జయ సూర్య తదితరులు పాల్గొన్నారు. పట్టుబడిన 1230 క్వాటర్ బాటిల్స్ కేసులను జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఉంచి రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. అధిక వేడి కారణంగా బాటిల్స్ ధ్వంసం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేశారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ అస్మి మాట్లాడుతూ ఆత్కూరు పోలీసులకు అందిన సమాచారం మేరకు మామిడి తోటలో మద్యం బాటిల్ నిల్వ చేశారని తెలపడంతో హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ అల్లు నవీన్ నరసింహమూర్తి, ఆత్కూరు పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేందుకు అధికారిక అనుమతి తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. మద్యం కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని, గోవా ప్రాంతానికి చెందిన రాయల్ గ్రాండ్ పేరుతో ఈ మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించామన్నారు. తదుపరి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)