జూన్ 4వ తేదీ లోగా స్టాక్ మార్కెట్లో షేర్లు కొనిపెట్టుకొండి !

Telugu Lo Computer
0

                                                 

జూన్ 4వ తేదీలోగా స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనిపెట్టుకోవాలని, ఆ తర్వాత మార్కెట్ బాగా పుంజుకుంటుందని ఇన్వెస్టర్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు పోలింగ్ జరిగిన స్థానాల్లో బీజేపీకి ఆశించిన విధంగా పరిస్థితులు లేవని,ఈ కారణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయి. తక్కువ ఓటింగ్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోతున్నట్లు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన మెజారిటీ రాదన్న అంచనాలతోనే స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఓ ఇంటర్వ్యూలో ఆమిత్ షా మాట్లాడుతూ.."నిజానికి స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి ఎన్నికలకు ముడిపెట్టవద్దు. ఇంతకు ముందు చాలాసార్లు మార్కెట్లు భారీగా కరెక్షన్లకు గురయ్యాయి. ఇప్పుడు బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న వదంతులు ఎన్ని వ్యాప్తి చెందినా సరే నేను సూచిస్తున్నది ఏమిటంటే జూన్ 4వ తేదీలోగా స్టాక్ మార్కెట్లో షేర్లు కొని పెట్టుకోండి. జూన్ 4, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు కచ్చితంగా పెరుగుతాయి. మార్కెట్లు క్రాష్ అవుతుండడంపై నాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు మార్కెట్లు మళ్లీ లాభాల్లో కొనసాగుతాయి" అని అన్నారు. స్టాక్ మార్కెట్లకు ఎన్నికలకు సంబంధం లేకున్నా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మంచి పనితీరు ఉంటుందని అమిత్ షా చెప్పారు. ఎన్నికల తర్వాత సరికొత్త గరిష్ఠాలను స్టాక్ మార్కెట్ తాకుతుందా అని ప్రశ్నించగా.. స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ చేయాలనుకోవట్లేదని, కానీ, సాధారణంగా ఒక స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు మార్కెట్లు ఆటోమేటిక్ గా గణనీయంగా పెరుగుతాయని అమిత్ షా అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ,దాని మిత్రపక్షాలకు 400కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని, స్థిరమైన మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)