బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప ప్రజాస్వామ్య వాది అని అన్నారు. ఆయన స్పూర్తితోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎంతో సేవ చేశారని తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. జనతా పార్టీ ఆయనని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ మాత్రం దళితుల్ని ప్రధాని కాకుండా అడ్డుకుందని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విష ప్రచారం చేసి ఆయనను ప్రధాని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన స్పూర్తితోనే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లను ముద్రించే మిషన్లు పెడతారేమోనని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముందు గత ఎన్నికల్లో యువత, మహిళా, రైతు డిక్లరేషన్ పేరుతో ఏయే గ్యారంటీలు ఇచ్చారో దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అమలు చేసి చూపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా డబ్బులు ఖర్చు పెట్టినా సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకే వస్తాయని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి ఎద్దేవా !
April 05, 2024
0
Tags