ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేయడం కలకలం రేపింది. కాంపౌండ్ లో దహనం చేసిన పత్రాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిట్ స్వాధీనం చేసుకున్న హెరిటేజ్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాదని తేలడంతో ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇక ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పత్రాలు తగలబెడితే మీరు చేసిన పాపాలు పోతాయా అంటూ లోకేష్ ప్రశ్నించారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీ సిఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందన్నారు. తాము ఎప్పటినుంచో చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ఘటనతో నిజమయ్యాయని లోకేష్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిఐడి డిఐజి రఘురామిరెడ్డి నేతృత్వంలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని, మళ్లీ తమ ప్రభుత్వం రాదన్న అనుమానంతో పత్రాలు తగల పెడుతున్నారని లోకేష్ విమర్శించారు. అయితే తాడేపల్లిలోని సిట్ కార్యాలయం కాంపౌండ్ లో దహనం చేసిన పత్రాలకు సంబంధించి ఏపీ సి ఐ డి స్పందించింది. ఇక ఈ వ్యవహారంలో టిడిపి ఆరోపణలపై సీరియస్ అయిన ఏపీ సిఐడి హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారు అని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఫైళ్లను తగలబెట్టారు అంటూ చేసిన ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా ఐదు కేసుల్లో ఛార్జ్ ఫీట్లు దాఖలు చేశామని, ప్రతి ఛార్జిషీట్ కు ఎనిమిది వేల నుండి పదివేల వరకు పేజీలు ఉన్నాయని పేర్కొంది. ప్రతి ఛార్జి షీట్ కాపీలను నిందితులకు అందించామని, హెరిటేజ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కోర్టుకు అందజేశామని పేర్కొంది. అయితే చార్జిషీట్ ను రూపొందించే సమయంలో సరిగ్గా ప్రింట్ కాని, వేస్ట్ పేపర్లను తగలబెట్టినట్లు పేర్కొంది. కొన్ని మీడియా ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తును తప్పుదారి పట్టించడం కోసం, అధికారుల నైతికతను దెబ్బ తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది.
సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం ?
April 08, 2024
0
Tags