కేసీఆర్ రైతుల సమస్యల గురించి మాట్లాడితే మంత్రులు తిడుతున్నారు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని జహీరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం శనివారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీమంత్రి హరీష్‌రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయనను తిడుతున్నారన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని అంటున్నారని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో తన మ్యానిఫెస్టోలో ఇతర పార్టీ వాళ్లను కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దని అంటారు.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ నేతలు చేరికలపై దృష్టి పెడతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ 5 ఏళ్ల త్వరాత మళ్లీ అధికారంలోకి రాదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏం చేస్తారో చేయండి కానీ 5 ఏళ్ల తర్వాత ఆ పార్టీ నేతలకు తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. హామీలను అమలు చేసేదాక కాంగ్రెస్ నేతలను వదలి పెట్టేది లేదని హరీష్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మడం లేదని బాండ్ పేపర్లు రాసి ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. హామీలు ఇచ్చి మోసాలు చేసిన కాంగ్రెస్ నేతలపై పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టాలన్నారు. మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని మాట తప్పారని ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ అయిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కానీ వారు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్ని మోసమేనని చెప్పారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీరు పెట్టించిందని మండిపడ్డారు. కొత్త పథకాలు ఇవ్వడం కాదు ఉన్న పథకాలను బంద్ చేశారన్నారు. రేవంత్ ప్రధానిని బడే బాయ్ అని అంటున్నాడన్నారు. తెలంగాణను గుజరాత్ మోడల్ చేయాలని రేవంత్ ప్రధానిని కోరాడని చెప్పారు. గుజరాత్‌ను తెలంగాణకు మోడల్‌గా చేసి సీఎం రేవంత్ గోద్రా అల్లర్లు సృష్టించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఉసురు పోసుకొందని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)