తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు (హారిజాంటల్) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్‌ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు క్యాటగిరీల్లో 100లో 33 శాతం (1/3) రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేశ్‌కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ విధానం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు -1996 ప్రకారం మహిళలకు ఓపెన్, రిజర్వుడ్ క్యాటగిరీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉన్నది. గ్రూప్ – 1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేశ్‌కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో టీఎస్పీఎస్సీ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలుచేయాలని 2022 డిసెంబర్ 2న మెమో జారీ చేసింది. ప్రస్తుతం.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి టీఎస్పీఎస్సీతోపాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలకు ఉత్తర్వులు జారీ
February 09, 2024
0
Tags