ఇడి అధికారులపై తృణమూల్ కార్యకర్తల దాడి !

Telugu Lo Computer
0

శ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు కోసం  ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సందేశ్‌ఖలి ప్రాంతానికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై శుక్రవారం ఉదయం విచక్షనారహితంగా దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, ఇదే కేసులో అరెస్టయిన రాష్ట్ర మంత్రికి సన్నిహితుడైన షాజహాన్ షేక్‌ను ప్రశ్నించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఇడి అధికారులపై షాజహాన్ మద్దతుదారులు దాడి చేశారు. అధికారులను విచక్షణారహితంగా కొట్టడంతో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. అధికారులకు రక్షణగా వచ్చిన సిఆర్‌పిఎఫ్ బలగాలకు చెందిన వాహనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.  పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ఉండడంతో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది సైతం నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో రేషన్ పంపిణీ కుంభకోణంపై ఇడి దర్యాప్తు చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అబ్ధిదారులకు అందచేసే రేషన్‌లో 30 శాతం బహిరంగ మార్కెట్‌కు మళ్లించారని, దాని ద్వారా వచ్చిన సొమ్మును రేషన్ డీలర్లు, మిల్లర్లు పంచుకున్నారని ఇడి గతంలో ఆరోపించింది. కోట్లాది రూపాయల ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ను ఇడి ఇదివరకే అరెస్టు చేసింది. మంత్రి మల్లిక్‌కు షాజహాన్ సన్నిహితుడిగా పరిగణిస్తున్నారు. షాజహాన్ అనుచరులు జరిపిన దాడిలో మీడియాకు చెందిన టివిఆ కెమెరాలు, బ్రాడ్‌కాస్ట్ పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. పలువురు జర్నలిస్టులు, సహాయక సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షాజహాన్ మద్దతుదారుల దాడిలో తలలు పగిలి, రక్తసిక్త గాయాలైన ఇడి అధికారులు తమ వాహనాలు కూడా ధ్వంసం కావడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆటోరిక్షాలో అక్కడి నుంచి పారిపోయి గుర్తు తెలియని ప్రదేశంలో తలదాచుకున్నారు. కొన్ని గంటల వరకు వారి వెంట వచ్చిన భద్రతా సిబ్బందికి సైతం అధికారుల ఆచూకీ తెఇయరాలేదు. సంఘటన జరిగిన ప్రదేశానికి అనేక కిలోమీటర్ల దూరంలోని బసంతి హైవేపైన తమ ధ్వంసమైన వాహనాలలోనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు వేచి ఉండడం కనిపించింది. గాయపడిన అధికారులు కలకత్తాకు చేరుకుని అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వర్గాల ద్వారా సమాచారం అందింది.

Post a Comment

0Comments

Post a Comment (0)