దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నిలిచింది. జాతీయ నేర గణాంకాలు-2022 నివేదికను ఎన్‌సీఆర్‌బీ తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అత్యంత తక్కువ నేరాలు నమోదవుతున్న నగరాల జాబితాను పేర్కొంది. ఇందులో వరుసగా మూడో ఏడాది కోల్‌కతా అగ్రస్థానంలో నిలిచింది. ఇక, తక్కువగా నేరాలు నమోదవుతున్న నగరాల్లో పుణె రెండు, హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. మహా నగరాల్లో ప్రతి లక్ష జనాభాకు జరుగుతున్న సగటు నేరాల సంఖ్య ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ ఈ సురక్షిత నగరాల జాబితాను రూపొందించింది. ఐపీసీ సెక్షన్లతో పాటు.. ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన నేరాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. ఈ గణాంకాల ప్రకారం.. 2022లో ప్రతి లక్ష జనాభాకు సగటున కోల్‌కతాలో 86.5 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పుణెలో 280.7 కేసులు, హైదరాబాద్‌లో 299.2 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే కోల్‌కతాలో నేరాల సంఖ్య మరింత తగ్గడం విశేషం. ఆ ఏడాది ప్రతి లక్ష జనాభాకు సగటు నేరాల నమోదు సంఖ్య 103.4 కేసులుగా ఉంది. అంతకుముందు 2020లో ఈ సంఖ్య 129.5 కేసులుగా నమోదైంది.
అత్యంత సురక్షిత నగరంగా కోల్‌కతా !
December 05, 2023
0
Tags