విమానంలో వచ్చి ఏటీఎం చోరీ !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెలలో అమ్రైవాడి ప్రాంతంలోని ఏటీఎంను పగులగొట్టిన దొంగలు అందులో ఉన్న రూ.10.72 లక్షల విలువైన నోట్ల కట్టలను లూటీ చేశారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ చోరీపై దర్యాప్తు జరిపారు. పంజాబ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చండీగఢ్‌ నుంచి విమానంలో అహ్మదాబాద్‌కు చేరుకుని ఈ దొంగతనం చేసినట్లు తెలుసుకుని షాక్‌ అయ్యారు. కాగా, ఆ ఇద్దరు నిందితులు నకిలీ ఆధార్‌కార్డుల ద్వారా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో హోటల్‌ బుక్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా ద్విచక్ర వాహనం, గ్యాస్‌ కట్టర్లు, ఆక్సిజన్‌ సిలిండర్‌ కొనుగోలు చేసినట్లు చెప్పారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎంపిక చేసిన ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్న రూ.10.72 లక్షల నగదును దోచుకున్నారని వెల్లడించారు. ఈ చోరీ అనంతరం విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు వివరించారు. మరోవైపు అరెస్ట్‌ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన అమర్‌జోత్ సింగ్ అరోడా 2005లో ఒక హత్య కేసులో మొహాలీలో అరెస్టైనట్లు పోలీసులు తెలిపారు. 2010లో బెయిల్‌పై విడుదలైన అతడు ఈ ఏడాది ఏప్రిల్, జూన్‌లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పూణేలో ఏటీఎంలను తెరిచేందుకు ప్రయత్నించి దొరికిపోయినట్లు చెప్పారు. అలాగే బెంగుళూరులో కూడా హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి నాలుగు వేర్వేరు కేసులు కూడా అతడిపై నమోదైనట్లు వివరించారు. నిందితులిద్దరూ విమానాల్లో ప్రయాణించి ఏటీఎంలు చోరీ చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)