ఐటీ కంపెనీల్లో తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్య ?

Telugu Lo Computer
0


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం ఉద్యోగార్థులను కలవర పెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే జులై-సెప్టెంబరులో ఈ మూడు సంస్థల్లో కలిసి 16,000 మందికి పైగా ఉద్యోగులు తగ్గారు. ఇందుకు కారణమేమై ఉంటుంది?? ఇదే ధోరణి ఇతర కంపెనీల్లోనూ కనిపిస్తుందా అనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు..లాభ, నష్టాల గురించి ఎక్కువమంది ఆరా తీస్తుంటారు. కానీ ఈసారి ఐటీ కంపెనీల ఫలితాల్లో అందరి దృష్టి ఉద్యోగుల సంఖ్యపై పడుతోంది. ఎందుకంటే దిగ్గజ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. ఈ మూడింటిలోనూ కలిపి రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 16,162 మేర తగ్గింది. ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అనేది తక్కువ సందర్భాల్లోనే జరుగుతోంది. అయితే ఈసారి ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా తగ్గడం, ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితి లేకపోవడం ఉద్యోగార్థులను కలవర పెడుతోంది.. టీసీఎస్‌ విషయానికే వస్తే ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఏకంగా 6,333 తగ్గింది. గత అయిదేళ్ల గణాంకాలు పరిశీలించినా.. ఇంత భారీగా ఉద్యోగులెప్పుడూ తగ్గిన దాఖలాల్లేవు. ఇన్ఫోసిస్‌లో 7,530 మంది, హెచ్‌సీఎల్‌ టెక్‌లో 2,299 మంది చొప్పున తగ్గారు. ఇదే తరహాలో ఇతర ఐటీ కంపెనీల్లోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందా అనే సందేహాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మానవ వనరుల అధిపతుల అభిప్రాయం ప్రకారం.. ఆయా కంపెనీలు ఇప్పటికే నియమించుకున్న ఉద్యోగులను, వారి నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్నాయి. అంటే బెంచ్‌పై ఉంచే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తమ దగ్గర రాజీనామా చేసి, వేరే కంపెనీలకు వెళ్లిపోయిన సిబ్బంది (వలసల) సంఖ్యకు తగ్గట్లుగా కొత్తవారిని నియమించడం లేదు. దీంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. టీసీఎస్‌ సంగతికే వస్తే.. గత ఒకటిన్నరేళ్లలో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్ల)పై పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇపుడు వాటి ఫలితాలు కనిపిస్తున్నాయని కంపెనీ ముఖ్య మానవ వనరుల అధికారి మిలింద్‌ లక్కడ్‌ ఇటీవలి ఫలితాల సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు తమకు అవసరమున్నపుడల్లా బెంచ్‌పై ఉన్న ఫ్రెషర్లను తీసుకుని, అవసరమైన నైపుణ్యాల్లో వారికి శిక్షణ ఇస్తూ.. వినియోగించుకుంటున్నాయి. వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు ఉద్యోగుల సంఖ్య తగ్గుతూనే ఉండొచ్చని, అయితే ఇప్పటిలాగా భారీగా ఏమీ తగ్గకపోవచ్చని లక్కడ్‌ స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్‌ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. ఇప్పటికే బెంచ్‌పై ఎంచదగ్గరీతిలోనే ఫ్రెషర్లు ఉన్నారని సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి నీలాంజన్‌ రాయ్‌ అంటున్నారు. ఉద్యోగుల వినియోగస్థాయినీ కంపెనీ పెంచుకోవాలనుకుంటోంది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్రెషర్ల సంఖ్య వల్ల సిబ్బంది వలసల రేటు తగ్గొచ్చని హెచ్‌సీఎల్‌ టెక్‌ అంటోంది. గత కొన్నేళ్లుగా ఫ్రెషర్లపై పెట్టిన పెట్టుబడులు ఇపుడు మంచి ఫలితాలను ఇస్తున్నాయని.. అవే త్రైమాసిక గణాంకాల రూపంలో కనిపిస్తున్నాయని కంపెనీ సీఈఓ సి. విజయ్‌ కుమార్‌ చెప్పారు. ఐటీ సాఫ్ట్‌వేర్‌/సేవల నియామక సూచీ గతేడాది తొమ్మిది నెలలతో పోలిస్తే, ఈ ఏడాది తొమ్మిది నెలల్లో తగ్గుతూనే వచ్చిందని నౌకరీకి చెందిన జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ సూచిస్తోంది. గిరాకీలో మందగమనం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి వల్ల కొద్ది త్రైమాసికాల్లో వలసల రేటు కూడా తగ్గుతోంది. దీని వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గిందని వివరిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)