హోటల్‌లో దంపతుల ఆత్మహత్య

Telugu Lo Computer
0


కేరళ రాజధాని తిరువనంతపురంలో మూడు నెలల కిందట కూతురుకు గ్రాండ్‌గా వివాహం జరిగిన ఫైవ్‌ స్టార్‌ లగ్జరీ హోటల్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. అలాగే తమ కుమార్తెకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఆ నోట్‌ ద్వారా పోలీసులను కోరారు. గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన 70 ఏండ్ల సుగాతన్‌, 60 ఏండ్ల భార్య సునీల కలిసి ఇటీవల తిరువనంతపురంలోని ఫైవ్‌ స్టార్‌ లగ్జరీ హోటల్‌ గదిలో బస చేశారు. ఆ దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి ఓనమ్‌ పండుగను ఆ హోటల్‌లో సంతోషంగా జరుపుకున్నారు. అయితే గురువారం ఆ హోటల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, రూమ్‌ క్లీనింగ్‌ కోసం హోటల్‌ సిబ్బంది చాలాసేపు బెల్‌ మోగించినప్పటికి ఆ దంపతుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో అనుమానించిన హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ హోటల్‌కు చేరుకున్నారు. హోటల్‌ రూమ్‌ తెరిచి చూడగా దంపతులు సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. మరోవైపు ఆ హోటల్‌ రూమ్‌లో ఒక సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యల వల్ల తాము ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో ఉంది. అలాగే అదే ఫైవ్‌ స్టార్‌ లగ్జరీ హోటల్‌లో మూడు నెలల కిందట వివాహం జరిగిన తమ కుమార్తెకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఆ నోట్‌ ద్వారా పోలీసులను కోరారు. అయితే వ్యాపారంలో నష్టాలతోపాటు కుమార్తె పెండ్లి వ్యయం వల్ల మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆ దంపతులు దీనికి ముందు మరో హోటల్‌లో కూడా సూసైడ్‌కు ప్రయత్నించారు. అయితే హోటల్‌ సిబ్బంది సకాలంలో స్పందించి హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈసారి కుమార్తె పెండ్లి జరిగిన లగ్జరీ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఆ దంపతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)