ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ

Telugu Lo Computer
0


ఇండోనేషియా రాజధాని జకార్తాలో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. జకార్తాలో ఆసియాన్‌-భారత్‌ సదస్సులో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్ఛారు. సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సు సన్నద్ధతపై కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో కేంద్రమంత్రులతో సమావేశమై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జీ20 సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే మొదలుకావడంతో సందడి వాతావరణం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తదితర దిగ్గజ నేతలంతా సెప్టెంబర్‌ 8న ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర కీలక అంశాలపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రగతి మైదాన్‌లో నూతనంగా తీర్చిదిద్దిన భారత్‌ మండపం వేదికగా జరగనుంది. ఈ సదస్సు నిర్వహణను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మెగా ఈవెంట్‌కు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి అధికారులు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)