హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తన మూడు వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాల్లో ఉన్న 51లక్షలను విరాళంగా సతీమణితో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ ''ఇదంతా నా వ్యక్తిగత సేవింగ్స్ నుంచి ఇస్తున్నా. విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేకమంది చిన్నారులు తమ పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను సహాయంగా అందించారు. అధికారులు, ఉద్యోగులు, పింఛను తీసుకొనే వృద్ధులు తమ శక్తి మేరకు విరాళాలు ఇచ్చారు. అందువల్ల నా మూడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును సేకరించి ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నా'' అని చెప్పారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన హిమాచల్‌ప్రదేశ్‌లో బాధితులకు సాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర విపత్తు సహాయ నిధికి సాధారణ ప్రజలు, పలు సంస్థలు ఉదారతతో సహకరించాలని గతంలో సీఎం విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు ముందుకొచ్చి విరాళాలను విరివిగా అందిస్తున్నారు. చిన్నారులు సైతం తమ పిగ్గీ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని విపత్తు సహాయ నిధికి ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను సైతం విపత్తు సహాయ నిధికి తనవంతు సాయం చేయాలని భావించిన సీఎం తన సేవింగ్స్ నుంచి ₹51లక్షల మొత్తాన్ని అందజేయడం విశేషం.