సివిల్స్‌ అభ్యర్థులకు ఆ సడలింపులు ఇవ్వలేం !

Telugu Lo Computer
0

దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపికకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రం తేల్చి చెప్పింది. కరోనా మహమ్మారి, ఆ తర్వాత విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఒక ఏడాది కోల్పోయిన అభ్యర్థులకు వయో సడలింపు ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ సింగ్‌ హుడా అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ప్రయత్నాల సంఖ్య, వయో పరిమితికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నిబంధనలకు అనుగుణంగానే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఏటా నిర్వహిస్తుందని మంత్రి చెప్పారు. కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, డిపార్ట్‌మెంట్ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను సిబ్బంది, శిక్షణ శాఖ పరిశీలించిందని.. అయితే, CSE పరీక్ష రాసేందుకు అభ్యర్థులు హాజరయ్యేందుకు ఉన్న అవకాశాలు, వయో పరిమితి విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనల్లో ఏ మార్పులు చేయడానికైనా వీలు పడటంలేదన్నారు. అలాగే, సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలకు తేదీలు నిర్ణయించడంతో పాటు పరీక్ష కేంద్రాలను యూపీఎస్సీనే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ 2023 పరీక్ష మే 28న జరగ్గా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఈ పరీక్షలో 14,624 మంది అర్హత సాధించారని.. ఈ పరీక్షలో ఫెయిల్‌ అయిన కొందరు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారని మంత్రి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)