పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మణిపూర్ అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తతలను చల్లార్చడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. 'ఈ దేశం మొత్తానికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని మోడీ మణిపూర్ గురించి అస్సలు ఆలోచించడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. మణిపూర్ లో ఘర్షణల విషయం తెలియగానే మోడీ తెల్లవారుజామున నాలుగింటికి ఒకరోజు ఫోన్ చేశారు. మరుసటి రోజు ఉదయం ఆరున్నరకు ఫోన్ చేశారు. మూడురోజుల పాటు నిమిషం తీరిక లేకుండా మేం పనిచేశాం. 16 వీడియో కాన్ఫరెన్సుల్లో పాల్గొన్నాం. అలాగే 36,000 మంది కేంద్ర బలగాల సిబ్బందిని పంపించాం. వైమానిక దళాన్ని ఉపయోగించాం. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీని బదిలీ చేశాం. సూరత్ నుంచి ఒక సలహాదారును పంపాం. ఇవన్నీ కేంద్రం మే నాలుగునే చేసింది' అని వెల్లడించారు. మైతేయ్‌లకు ఎస్టీ హోదా విషయంలో ఆందోళనకు గురైన గిరిజన ప్రాంత ప్రజలు చురాచాంద్‌పుర్‌లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీ హింసాత్మకంగా మారిన 24 గంటల్లోనే కేంద్రం ఈ చర్యలన్నీ తీసుకుందని అమిత్ షా పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 356 కింద మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిని అమిత్ షా తోసిపుచ్చారు. 'ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయట్లేదని వారు అడుగుతున్నారు. హింసాత్మక ఘటనల సమయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సహకరించనప్పుడు మాత్రమే ఈ నిబంధనను అమలు చేస్తారు. ప్రస్తుతం మాకు ఆ సమస్య ఏమీ లేదు' అని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను ఎందుకు తొలగించడం లేదని విపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 'ఆయన కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనప్పుడు అలాంటి అవసరం ఉంటుంది. మణిపూర్ సీఎం మాకు సహకరిస్తున్నారు' అని తెలిపారు.
మణిపూర్ పై మోడీ తెల్లవారు జామున 4 గంటలకు ఫోన్ చేశారు !
August 10, 2023
0
Tags