ఉచిత ప్రయాణం ఎఫెక్ట్‌తో బస్సులన్నీ కిటకిట !

Telugu Lo Computer
0


కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభావం ఆర్టీసీపై భారీగా పడుతోంది. ఇంతకు ముందు ప్రైవేటు, ఆర్టీసీ తేడా లేకుండా ఏ బస్సు ముందు వస్తే దానికి వెళ్లిపోయేవారు. ఎలాగోలా త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆత్రుత ఉండేది. కానీ ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక మహిళలందరూ దాదాపు ఆర్టీసీలోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్టాండ్లు, బస్సులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో మరిన్ని బస్సు సర్వీసులు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మంగళవారం విజయపుర బస్టాండ్‌లో ప్రైవేట్‌ బస్సులు ఉన్నా ఆర్టీసీ బస్సుల కోసం చాలాసేపు వేచి ఉన్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లేవారు బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ట్రాఫిక్‌ అధికారులు స్పందించి ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులను సర్దుబాటు చేసినా రద్దీ వేళల్లో అయినా అదనపు సర్వీసులు నడపాలని కోరుతున్నారు. శిడ్లఘట్ట నుంచి విజయపుర మార్గంలో బెంగళూరు వైపు బస్సులు చాలా తక్కువని, అంకతట్టి, నంజుండప్ప సర్కిల్‌, శిడ్లఘట్ట సర్కిల్లో ఆర్టీసీ సర్వీసులు నిలపని కారణంగా ప్రైవేట్‌ బస్సులే శరణ్యమయ్యాయని పలువురు ప్రయాణికులు అంటున్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఆర్టీసీ సర్వీసులు లేవని డిమాండ్‌కు అనుగుణంగా నడపాలని కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)