కొరియర్‌ సంస్థల పేరుతో సైబర్‌ మోసాలు !

Telugu Lo Computer
0


ఫెడెక్స్‌, బ్లూడార్ట్‌ వంటి కొరియర్‌ సంస్థల పేరుతో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయని జెరోదా సీఈవో నితిన్‌ కామత్‌ తెలిపారు. పార్శిల్‌లో మాదకద్రవ్యాలు గుర్తించామని బెదిరింపులకు గురి చేస్తూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి తన సహోద్యోగికి ఎదురైన ఓ సంఘటనను ఆయన ట్విటర్‌ వేదికగా యూజర్లతో పంచుకున్నారు. ''ఫెడ్‌ఎక్స్‌, బ్లూడార్ట్‌ వంటి ప్రముఖ కొరియర్‌ కంపెనీల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. నా సహోద్యోగికి ఫెడ్‌ఎక్స్‌ నుంచి మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. మీ పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. నకిలీ పోలీసులను రంగంలోకి దింపారు. వారు ఆధార్‌ నంబరు వివరాలు తెలపడంతో నా సహోద్యోగి వారి మాటలు నమ్మాడు. వెంటనే వారికి నగదు పంపించాడు. సైబర్ మోసాల గురించి ప్రతి ఒక్కరినీ నిరంతరం అప్రమత్తం చేసే సంస్థలో పనిచేసే వ్యక్తికే ఇలా జరిగితే ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఎవరికైనా జరగొచ్చు'' అని నితిన్ కామత్‌ పేర్కొన్నారు. అంతేకాక ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించారు. ''ఇలాంటి పరిస్థితి ఒకవేళ మీకు ఎదురైతే.. మీతో మాట్లాడటానికి మా లాయర్‌ను తీసుకువస్తాను అని చెప్పండి. ఒకవేళ మీకు ఏ లాయర్‌ తెలియకపోయినా ఫర్వాలేదు. మీరేం భయపడట్లేదని వారికి తెలిస్తే చాలు. భయపడే వారినే వారు లక్ష్యంగా చేసుకుంటారు. కాబట్టి ప్రతిస్పందించే ముందు తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించండి'' అని సూచనలు చేశారు. ట్వీట్ చూసిన యూజర్లు తమకు ఎదురైన సంఘటనలను పంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వారు ఏవిధంగా మోసపోయారో తెలుపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)