కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వరుణుడు కరుణించి తమ ప్రాంతంలో వర్షం కురిపించాలని ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కొన్ని చోట్ల చాలా తక్కువ వర్షపాతం నమోదవుతోంది. కృష్ణరాజ్‌పేట్ తాలూకాలోని గంగెనహల్లి గ్రామంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. వర్షాలు కురవకపోతే ఇబ్బందులు తప్పవని భావించిన ఆ గ్రామస్థులు తమ ఆచారాలను అనుసరిస్తూ వరుణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇద్దరు అబ్బాయిలకు వివాహం జరిపించారు. ఒకరిని వధువుగా మరొకరిని వరుడిగా అలంకరించి పెళ్లితంతు నిర్వహించారు. అనంతరం విందు కూడా ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తీరప్రాంతాల్లో సాధారణ, భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలు, దక్షిణ లోతట్టు ప్రాంతాల్లోని పలు జిల్లాలు, ఉత్తర లోతట్టు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న మూడు రోజుల్లో ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
వానల కోసం అబ్బాయిలకు పెళ్లి !
June 24, 2023
0
Tags