రైల్వే స్టేషన్ల చివర్లో సెంట్రల్, కంటోన్మెంట్ లాంటి పేర్లు ఎందుకు ఉంటాయి? అనే సందేహాలు ప్రయాణికుల్లో ఉంటాయి. ఇదే కాదు రైల్వే స్టేషన్ల పేర్లలో చివర్లో PH అని కూడా ఉంటుంది. రైల్వేలో చాలా స్టేషన్ల పేరు వెనుక PH అని ఉండటం వెనుక ఓ కారణం ఉంది. దానికి ఓ అర్థం ఉంది. వాస్తవానికి ఈ స్టేషన్లు ఇతర స్టేషన్ల కంటే ప్రత్యేకమైనవి. రైల్వే స్టేషన్ పేరులో PH అంటే ప్యాసింజర్ హాల్ట్ స్టేషన్ అని అర్థం. స్టేషన్ పేరుతోపాటు PH అని రాస్తే ఆ స్టేషన్‌లో కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయని అర్థం. ఈ స్టేషన్లు మిగిలిన వాటి కంటే కొంచెం ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇక్కడ రైల్వేశాఖ ఉద్యోగులను నియమించదు. ప్యాసింజర్ హాల్ట్ స్టేషన్లను డి క్లాస్ స్టేషన్లుగా పిలుస్తారు. ఇక్కడ రైళ్లు ఆగుతున్నట్లు సూచించే సిగ్నల్ కూడా ఉండదు. స్టేషన్‌లో సిగ్నల్ లేనప్పుడు రైళ్లు ఇక్కడ ఎలా ఆగుతాయి అనే సందేహం రావడం మామూలే. వాస్తవానికి రైలు నడిపే వ్యక్తికి సాధారణంగా అలాంటి స్టేషన్లలో రైలును సుమారు 2 నిమిషాల పాటు ఆపమని సూచనలు ఉంటాయి. లోకో పైలట్లు వారి విచక్షణ ఆధారంగా ఈ స్టేషన్లలో రైలును ఆపుతారు. మరి రైల్వే సిబ్బంది లేనప్పుడు ట్రైన్ టికెట్స్ ఎవరు ఇస్తారన్న సందేహం కూడా వస్తుంది. వాస్తవానికి, అటువంటి డి క్లాస్ స్టేషన్లలో, కాంట్రాక్ట్ లేదా కమిషన్ ప్రాతిపదికన టిక్కెట్లను అమ్మడానికి భారతీయ రైల్వే స్థానిక వ్యక్తిని నియమిస్తుంది. అయితే ఇలాంటి స్టేషన్లు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటి నుంచి రైల్వేకు ప్రత్యేక ఆదాయం రాకపోవడంతో వాటిపై కూడా దృష్టి సారించడం లేదు. అటువంటి స్టేషన్లను స్థానిక ప్రజల డిమాండ్‌తో కొనసాగించాలి. లేదా మూసివేసిన రైల్వే స్టేషన్‌లను మళ్లీ ప్రారంభించాలి. ఇక ఇవి కాకుండా సెంట్రల్, జంక్షన్, టెర్మినల్ స్టేషన్స్ ఉంటాయి. ఉదాహరణకు ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఆనంద్ విహార్ టెర్మినల్, కాజిపేట్ జంక్షన్ అని పేర్లు ఉంటాయి. సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటే ఈ స్టేషన్ నుంచి బయలుదేరే లేదా చేరుకునే రైళ్లు దేశంలోని దాదాపు ప్రతీ రూట్‍ను కవర్ చేస్తాయి. టెర్మినల్ లేదా టెర్మినస్ అంటే అదే చివరి స్టాప్ అని అర్థం. ఈ రైల్వే స్టేషన్‌కు వచ్చే రైలు ఇంకా ముందుకు వెళ్లదు. జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే మూడు లేదా అంతకన్నా ఎక్కువ రైలు మార్గాలు కలిపే రైల్వే స్టేషన్. ఆర్మీ అవుట్‌పోస్ట్ లేదా కంటోన్మెంట్ ఉన్న నగరాల్లోని రైల్వే స్టేషన్లకు చివర్లో Cantt అని ఉంటుంది.
రైల్వే స్టేషన్లకు PH, Cantt అని ఎందుకు ఉంటుంది ?
May 30, 2023
0
Tags