పతకాలు వెనక్కి ఇచ్చేస్తామంటూ అమిత్ షాకు అథ్లెట్ల లేఖ !
May 30, 2023
0
మణిపూర్ జాతుల మధ్య వైరంతో సంక్షోభంలో చిక్కుకుపోయింది. భద్రతాబలగాల మోహరింపుతో తాత్కాలికంగా పరిస్థితులను అదుపులోకి తీసుకువస్తున్నా ఏ క్షణంలో ఘర్షణలు చెలరేగుతాయో తెలియని వాతావరణం నెలకొని ఉంది. ఈ పరిస్థితిపై అక్కడి క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రశాంతత నెలకొనకపోతే తమ పతకాలు వెనక్కి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఎనిమిది డిమాండ్లను పెట్టారు. ఆ లేఖపై సంతకాలు చేసిన 11 మంది అథ్లెట్లలో ఒలింపిక్ మెడల్ విజేత మీరాబాయి చాను, పద్మా అవార్డు గ్రహీత అయిన వెయిట్ లిఫ్టర్ కుంజారాణి దేవి, భారత మహిళా ఫుట్‌బాల్ టీం మాజీ కెప్టెన్ బెం బెం దేవీ, బాక్సర్ ఎల్ సరితా దేవీ వంటి ప్రముఖులు ఉన్నారు. 'గత కొద్దివారాలుగా పలు ప్రాంతాల్లో జాతీయ రహదారి-2ను బ్లాక్ చేశారు. దాంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. సాధ్యమైనంత త్వరగా అక్కడ సాధారణ పరిస్థితి , రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించండి. లేకపోతే మా పతకాలను వెనక్కి ఇచ్చేస్తాం'అని అమిత్ షాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ సంక్షోభ పరిస్థితులు సద్దుమణిగేలా చూసేందుకు నాలుగురోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా ప్రస్తుతం మణిపుర్‌లో ఉన్నారు. ఆయన రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్ గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ హోదా విషయంలో మెయిటీలు, గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు వారి కుటుంబాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10లక్షల పరిహారం ప్రకటించాయి. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చాయి.
Tags