ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి !

Telugu Lo Computer
0


కేరళలో ఒకే కుటుంబంలోని ఐదుగురు శవాలై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. కన్నూరు జిల్లాలోని చెరుపుళ పడిచలిల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. చిన్నారుల మృతదేహాలు మెట్లపై ఉన్నాయని, దంపతులు సీలింగ్ ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన దంపతులకు ఇటీవలే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. జిల్లాలోని చెరువతూర్ ప్రాంతానికి చెందిన శ్రీజ తన రెండో భర్త షాజీతో కలిసి నివసిస్తోంది. ఆమెకు మొదటి భర్త సునీల్​తో ముగ్గురు సంతానం ఉన్నారు. చిన్నారులు సూరజ్ (12), సుజిన్ (8), సురభి (6) వారు ప్రస్తుతం తమ తల్లి శ్రీజతోనే ఉంటున్నారు. షాజీకి సైతం గతంలోనే ఓ వివాహం జరిగింది. అతడికి ఇద్దరు సంతానం ఉన్నారు. షాజీ, శ్రీజ.. కొద్ది రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. తమ జీవితభాగస్వాములకు విడాకులు ఇవ్వకుండానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. షాజీతో వివాహానికి శ్రీజ కుటుంబ సభ్యులు సైతం అడ్డు చెప్పారని స్థానికులు తెలిపారు. అయితే, ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని తాము ఊహించలేదని అన్నారు. శ్రీజకు కుటుంబ సమస్యలు ఉన్నాయని పోలీసులు సైతం వెల్లడించారు. ఇటీవలే శ్రీజను, ఆమె రెండో భర్తను పోలీస్ స్టేషన్​కు పిలిపించి మాట్లాడినట్లు డిప్యూటీ ఎస్​పీ కేఈ ప్రేమచంద్రన్ తెలిపారు. 'బుధవారం ఉదయం 6 గంటలకు శ్రీజ పోలీస్ స్టేషన్​కు కాల్ చేసింది. ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్​లో చెప్పింది. కానీ, పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం పరీక్షల తర్వాతే చిన్నారుల మృతిపై పూర్తి స్పష్టత వస్తుంది' అని ప్రేమచంద్రన్ వివరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)