లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. తాను పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ వెల్లడించారు. తాను చట్టం నుంచి పారిపోవడం లేదని చెప్పారు. తాను తన నివాసంలోనే ఉన్నానని చెప్పారు. మరోవైపు బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన గద్దె దిగేవరకూ తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. రెజ్లర్ల ఆందోళనను ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ చీఫ్ పీటీ ఉష నిన్న తప్పుబట్టారు. కమిటీ నివేదిక వచ్చేవరకూ కూడా సహనం లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆందోళన క్రమశిక్షణ పాటించకపోవడం కిందకు వస్తుందని ఉష ఆరోపించారు. వాళ్లు చేసే ఆందోళనతో క్రీడలకు, దేశానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రతికూల ధోరణి కనపరుస్తున్నారని రెజ్లర్లపై ఉష అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఉష స్పందనపై రెజ్లర్లు విచారం వ్యక్తం చేశారు. ఓ మహిళ అయ్యుండి తోటి మహిళా రెజ్లర్ల సమస్యను ఉష పట్టించుకోలేకపోతున్నారని సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ వాపోయారు. ఇందులో క్రమశిక్షణను ఉల్లంఘించడమేముందన్నారు. గతంలో తన అకాడెమీ విషయంలో ఉష స్వయంగా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని రెజ్లర్లు గుర్తు చేశారు. రెజ్లర్లకు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, క్రీడాకారులు మద్దతు తెలియజేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆందోళన శిబిరాన్ని సందర్శించారు. ఒలింపిక్ చాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా రెజ్లరకు మద్దతు ప్రకటించాడు. కాగా..ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమం వందో ఎపిసోడ్ పూర్తవుతున్న సందర్భంగా..తమ మనసులోని మాటను వినాలని రెజ్లర్లు మోదీకి విజ్ఞప్తి చేశారు. పతకాలు గెలిచినప్పుడు సన్మానించి, తమతో ఫొటోలు దిగిన ప్రధాని, ప్రస్తుతం న్యాయం కోసం తాము ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడంలేదని రెజ్లర్లు ఆవేదన వ్యక్తంజేశారు. 'మోదీ సర్.. బేటీ బచావో, బేటీ పడావో గురించి మాట్లాడతారు. అలాగే అందరి మదిలోని మాటల్నీ వింటారు. అలాంటిది మీరు మా మనసులో మాట వినలేరా?' అని సాక్షి మాలిక్ ప్రశ్నించింది. 'మా ఆత్మలు దాదాపు శుష్కించిపోయాయి. ఈ విషయాన్ని ప్రధాని గమనిస్తారేమో' అని వినేశ్ ఉద్వేగంగా పేర్కొంది. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్లు వినేష్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు గత జనవరిలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంతో ఆరుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ అందులోని వివరాలు ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, బ్రిజ్‌భూషణ్‌కు కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చినట్టు రెబల్ రెజ్లర్లు ఆరోపిస్తున్నారు.
రాజీనామా చేసే దాకా ఆందోళన కొనసాగిస్తాం !
April 28, 2023
0
Tags