గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ వైరస్ ఉద్ధృతి తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్ ఎండెమిక్ దశకు చేరుకుందని వైద్య వర్గాలు తాజాగా వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. అంతేగాక, మరో రెండు వారాల్లో ఈ కేసులు తగ్గుముఖం పడతాయని సదరు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత వైరస్ వ్యాప్తికి ఒమిక్రాన్ ఉపరకమైన XBB.1.16 వేరియంట్ కారణమని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఒమిక్రాన్, దాని ఉపరకాల కారణంగా కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ.. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక, ఆసుపత్రిలో చేరికలు, మరణాలు పెరుగుతున్నట్లు ఆధారాల్లేవని తెలిపాయి. తాజా వ్యాప్తిలో ఆసుపత్రిలో చేరికలు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి. ''మన దేశంలో కొవిడ్ ఎండెమిక్ దశ (endemic stage)లోకి ప్రవేశిస్తోంది. అందువల్ల, వచ్చే 10-12 రోజులు కొత్త కేసులు పెరుగుతాయి. ఆ తర్వాత నుంచి వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టి కేసులు తగ్గుతాయి'' అని వైద్య వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7,830 కేసులు నమోదవ్వగా.. రోజువారీ పాజిటివిటీ 3.65 శాతంగా ఉంది. అటు క్రియాశీల కేసుల సంఖ్య 40వేలకు చేరింది.
దేశంలో ఎండెమిక్ దశకు కొవిడ్ !
April 12, 2023
0
Tags