రాజస్థాన్ లోని కరౌలీ జిల్లా మండరాయల్ సబ్ డివిజనులో మేకలకు నీళ్లు తాగించేందుకు నది వద్దకు వెళ్లిన బనీసింగ్ మీనా (29) తనకూ దాహంగా ఉండటంతో నీటికి దగ్గరగా వెళ్లి రెండు దోసిళ్లతో నీరు తాగబోయాడు. అంతే నీటి మాటు నుంచి ఒక్క ఉదుటున లేచి బనీసింగ్‌పై దాడి చేసిన మొసలి అతడి కాలిని నోట కరచి నీటి లోపలికి లాక్కొని పోయేందుకు ప్రయత్నించింది. అనూహ్యమైన ఘటనతో బిత్తరపోయిన బనీసింగ్ గట్టిగా కేకలు వేశాడు. కాస్త దూరంలో ఉన్న విమలా బాయి భర్త కేకలు విని పరుగున వచ్చింది. అక్కడి పరిస్థితిని చూసి వెంటనే తేరుకొన్న ఆమె.. నదికి దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలి తలపై పదే పదే బాదింది. కాసేపటికి బనీసింగ్ కాలు వదిలేసి మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారంతా అక్కడికి చేరుకొన్నారు. తీవ్రంగా గాయపడిన బనీసింగ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ''కళ్ల ముందు మృత్యువు కనిపించింది. నా భార్య తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది'' అని బనీసింగ్ తెలిపాడు. మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలుసని, ఆ క్షణంలో తన భర్తను కాపాడుకోవడం ఒక్కటే లక్ష్యం కావడంతో భయం వేయలేదని విమల తెలిపింది. ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమల సాహసంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మొసలితో పోరాడిన మగువ !
April 13, 2023
0
Tags