రిచ్‌మండ్‌ గాబ్రియేల్‌ యూనివర్సిటీ నుంచి మనోకు డాక్టరేట్‌

Telugu Lo Computer
0


ప్రముఖ గాయకుడు మనోను రిచ్‌మండ్‌ గాబ్రియేల్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించింది. సినీ సంగీత ప్రపంచానికి చేస్తున్న సేవలకుగాను ఆయనకు ఆ గౌరవాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మనో సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ''భారతీయ సంగీత పరిశ్రమలో.. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా 38 సంవత్సరాల్లో 15 భాషల్లో 25 వేలకుపైగా పాటలను అందించినందుకు రిచ్‌మండ్ గాబ్రియేల్ విశ్వవిద్యాలయం నాకు డాక్టరేట్‌ అందించింది. నన్ను సపోర్ట్‌ చేసే వారందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలానే ఉండాలి'' అని మనో ఆకాంక్షించారు. సంబంధిత పట్టా పట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచీ సంగీతంపై ఉన్న మక్కువతో మనో 14 ఏళ్ల వయసులోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎస్‌. విశ్వనాథన్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత మరో సంగీత దిగ్గజం చక్రవర్తి వద్ద పనిచేశారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ 1985లో గాయకుడిగా మారారు. 'ప్రియా ప్రియతమా రాగాలు', 'ముక్కాలా ముక్కాబులా లైలా', 'తిరుమల తిరుపతి వెంకటేశా', 'సింహమంటి చిన్నోడే' తదితర సూపర్‌హిట్‌ గీతాలన్నీ ఆయన ఆలపించినవే. సింగర్‌గా ఎంత పేరు సంపాదించుకున్నారో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గాను అంతే గుర్తింపు పొందారాయన. 'ముత్తు', 'అరుణాచలం', 'నరసింహ', 'చంద్రముఖి', 'శివాజి', 'రోబో'.. ఇలా పలు తమిళ సినిమాల్లోని ప్రముఖ హీరో రజనీకాంత్‌ పాత్రకు తెలుగు డబ్బింగ్‌ చెప్పింది మనోనే. కమల్‌హాసన్‌, రఘువరన్‌, అక్షయ్‌కుమార్‌, అనుపమ్‌ఖేర్‌ తదితరులు పోషించిన కొన్ని పాత్రలకూ మనో తన గాత్రం అందించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా, పలు టెలివిజన్‌ కార్యక్రమాలకు న్యాయ నిర్ణీతగా మనో తనదైన ముద్ర వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)