కాశీకి, తెలుగు వారికి మధ్య లోతైన బంధం ఉంది !

Telugu Lo Computer
0


గంగా పుష్కరాలను పురస్కరించుకొని శనివారం అక్కడి తెలుగు సమితి ఏర్పాటుచేసిన 'కాశీ తెలుగు సంగమం' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో మాధ్యమం ద్వారా మాట్లాడుతూ 'గంగా పుష్కరాలు.. గంగా-గోదావరి సంగమంతో సమానం. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం. కాశీకి, తెలుగువారికి మధ్య ఎంత లోతైన బంధం ఉందన్నదని కాశీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే తెలుగువారు వస్తే స్థానికులు తమ కుటుంబ సభ్యులు వచ్చినట్లుగానే భావిస్తారు. ఇక్కడికొచ్చే తీర్థయాత్రికుల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణవాసులే ఉంటారు. తెలంగాణలోని వేములవాడను దక్షిణ కాశీగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని ఆలయాల్లో చేతికి కట్టే నల్లతాడును ఇప్పటికీ కాశీతాడుగా పిలుస్తారు. ఈ నగరం తెలుగు రాష్ట్రాలకు ఎంతో దూరంగా ఉన్నప్పటికీ వారి హృదయాల్లో ఇంత దగ్గరగా ఉండటం ఎలా సాధ్యమైందని చూసినవారు ఆశ్చర్యపోతారు. గతంలో కాశీకి వచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఇక్కడి అభివృద్ధిని గమనించి ఉంటారు. ఏటికొప్పాక కొయ్యబొమ్మలు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ప్రాచుర్యం పొందాయో అలాగే కాశీ చెక్క బొమ్మలు కూడా ప్రసిద్ధమైనవే. కాశీలో విశ్వనాథుడు, విశాలాక్షి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మల్లికార్జునుడు, మాతా భ్రమరాంబ, తెలంగాణలో భగవాన్‌ రాజరాజేశ్వర్‌, తల్లి రాజరాజేశ్వరిలు ఉన్నారు. ఇవన్నీ భారతీయ సాంస్కృతిక వారసత్వానికి మహత్తరమైన కేంద్రాలు'' అని ప్రధాని పేర్కొన్నారు. గంగా పుష్కరాల కోసం తన నియోజకవర్గమైన వారణాసికి వచ్చిన తెలుగువారంతా తన అతిథులేనని అన్నారు. కార్యక్రమం నిర్వహించినందుకు కాశీ తెలుగు సమితికి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ, కాశీ తెలుగు సమితి కార్యదర్శి సుందరశాస్త్రి, పెద్దసంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)