ప్రమాదవశాత్తు బస్సు ఢీకొని కండక్టర్‌ మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం భరంపూర గ్రామానికి చెందిన బాతూరి గంగారాం (54) ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరగా 10:50 గంటలకు మంచిర్యాల బస్టాండ్‌కు చేరుకున్నారు. ఇంకా 15, 20 నిమిషాల టైం ఉండడంతో డ్రైవర్‌ బస్సును పాయింట్‌ మీద నిలిపారు. కండక్టర్‌ గంగారాం భోజనం చేసేందుకు టిఫిన్‌ బాక్స్‌ పట్టుకుని డిపోలోకి వెళ్తున్నాడు. అప్పటికే హైదరాబాద్‌ నుంచి వచ్చిన సూపర్‌ లగ్జరీ బస్సు డిపో లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ గది ముందు ఆగి ఉంది. డ్రైవర్‌ వాసాల తిరుపతి కుడివైపు ఉన్న కార్యాలయంలోని సెక్యూరిటీ అధికారులతో మాట్లాడుతున్నాడు. ఎడమవైపు నుంచి వచ్చిన గంగారాం లోనికి వెళ్తుండగా గమనించని డ్రైవర్‌ తిరుపతి బస్సును స్టార్ట్‌ చేశాడు. బస్సు ముందుకు కదలడంతో ఎడమవైపు నుంచి వచ్చిన గంగారాంను ఢీకొట్టింది. కండక్టర్‌ కిందపడిపోవడంతో గమనించకుండానే డ్రైవర్‌ బస్సును ముందుకు తోలడంతో వెనుక టైరు గంగారాం తలమీదినుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చూసిన ప్రయాణికులు, తోటి కండక్టర్లు, డ్రైవర్లు కంటతడి పెట్టుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై తైసినొద్దీన్‌ ప్రమాద వివరాలు సేకరించి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య పద్మ, కుమారుడు మనోజ్‌కుమార్‌, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పె కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మంచిర్యాల డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు హైదరాబాద్‌ నుంచి వచ్చింది. డిపోలో బస్సును అప్పగించి ఇంటికి వెళ్లాలన్న డ్రైవర్‌ తొందరపాటే ప్రమాదానికి కారణమైందని స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది పేర్కొంటున్నారు. బస్సు కిందపడిన కండక్టర్‌ అరుపులు విని డ్రైవర్‌ అప్రమత్తమై ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)