ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వాటర్ మెట్రో అనేది ప్రత్యేకమైన పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ. సంప్రదాయ మెట్రో వ్యవస్థలో మాదిరిగానే ఈ రవాణా వ్యవస్థలో కూడా ప్రయాణించవచ్చు. కొచ్చి వంటి నగరాల్లో ఇది ఉపయోగకరం. రూ.1,136.83 కోట్ల వ్యయంతో కొచ్చిలో ఈ మెట్రో వ్యవస్థను నిర్మించారు. కొచ్చి పరిసర ప్రాంతాల్లోని 10 దీవులను అనుసంధానం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల కొచ్చి నగర అభివృద్ధి వేగవంతమవుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. ఆయన ఇచ్చిన ట్వీట్‌లో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కొచ్చి వాటర్ మెట్రో ప్రారంభం కాబోతోందని తెలిపారు. కొచ్చి పరిసర ప్రాంతాల్లోని 10 దీవులను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు కలల ప్రాజెక్టు అని తెలిపారు. దీనిలో 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్ ఉన్నట్లు తెలిపారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మన్ ఫండింగ్ ఏజెన్సీ కెఎఫ్‌డబ్ల్యూ నిధులను సమకూర్చినట్లు తెలిపారు. వాటర్ మెట్రో ప్రాజెక్టు తొలి దశలో హైకోర్టు-విపిన్ టెర్మినల్స్ నుంచి వైట్టిల-కక్కనడ్ టెర్మినల్స్ వరకు సేవలు ప్రారంభమవుతాయి. ఈ మెట్రో సేవలు సురక్షితమని, చౌక కూడానని పినరయి విజయన్ తెలిపారు. ఎయిర్ కండిషన్డ్ బోట్లలో ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవలసిన అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చునన్నారు.
దేశంలో తొలి వాటర్ మెట్రోను ప్రారంభించనున్న మోడీ !
April 23, 2023
0
Tags