జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రెండో పక్షం వాదనలు వినకుండా జరిమానాలు విధించటం సహజ న్యాయం మూల సూత్రానికి విరుద్ధమంది. ఓ కేసులో తమ వాదన వినకుండానే ఎన్‌జీటీ భారీ జరిమానాను విధించిందన్న పిటిషను విచారణ సందర్భంగా జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ''ఈ ట్రైబ్యునళ్లు ఎలా పనిచేస్తున్నాయో చూడండి. కేవలం కమిటీ నివేదికల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసేస్తున్నాయి. కనీసం పార్టీలకు నోటీసులు కూడా ఇవ్వడం లేదు. ఇది సహజన్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధం'' అని పేర్కొంది. ఈ కేసులో బాధిత పక్షం తరఫున కోర్టుకు వచ్చిన సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వెలిబుచ్చిన అభ్యంతరాలను ధర్మాసనం నమోదు చేసింది. ఇటువంటి పలు ఉదంతాలు సుప్రీంకోర్టు ముందుకు వస్తున్నట్లు తెలిపింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులకు పౌరులు నిబద్ధులై ఉండేలా సమగ్ర చట్టాలను లేదా నిబంధనల రూపకల్పనకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయని కొన్ని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో వాదనలు ముగించేలాచూడటానికి చాలా కష్టపడాల్సి వస్తోందని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణ తేదీకి ఒక్క రోజు ముందు అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారని ఆక్షేపించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థాన కార్యాలయం అందజేసిన వివరాలను ప్రస్తావించింది. తదుపరి విచారణను మార్చి 28వ తేదీకి వాయిదా వేసింది. సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలకు చెందిన సంబంధిత శాఖ కార్యదర్శులు వర్చువల్ విధానంలో తదుపరి విచారణ రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలకు గత ఏడాది నవంబరులో విచారణ సందర్భంగా చివరి సారిగా అవకాశం కల్పిస్తూ నాలుగు వారాల గడువిచ్చింది. ఆ వ్యవధిలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోతే రూ.25వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
February 15, 2023
0
Tags