బీబీసీ కార్యాలయాల్లో సోదాలు కాదు, సర్వే !

Telugu Lo Computer
0


బీబీసీ ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ఇది కేవలం సర్వే అని, సోదాలు కాదని ఐటీ అధికారులు వెల్లడించారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు సిస్టమ్స్ వాడొద్దని, ఇంట్లోనే ఉండాలని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. పాత్రికేయుల ఫోన్లను,ల్యాప్‌టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే అవకతవకలకు సంబంధించి ఏవైనా ఆధారాలు గుర్తిస్తే, ఈ సర్వేను కాస్తా సోదాలుగా మార్చే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 2002 గుజరాత్ అల్లర్లపై 'ఇండియా ది మోదీ క్వశ్చన్' పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. దానిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. అదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది. విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. 'ఇది ఒక ప్రచార కార్యక్రమం. వారు ఎంచుకున్న కోణాన్నిప్రచారం చేయడానికి మాత్రమే దీనిని రూపొందించారు' అని వ్యాఖ్యానించారు. కాగా, డాక్యుమెంటరీ వివాదంపై అమెరికా, బ్రిటన్‌ దేశాలు దూరం పాటించాయి. ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. 'తాము అదానీ గ్రూప్‌పై వెలువడిన నివేదిక గురించి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం బీబీసీ వెంటపడింది. ఒకరి పతనం దగ్గరపడినప్పుడు..ఆ వ్యక్తి తన ఆలోచనలకు విరుద్ధంగా వెళ్తారు' అని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. షార్ట్‌ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేక సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ విమర్శలను భాజపా ఖండించింది. 'భారత్‌లో పనిచేస్తోన్న ఏ సంస్థ అయినా.. ఇక్కడి చట్టాలను అనుసరించాలి. చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తే ఎందుకు భయపడాలి..? ఐటీ అధికారుల్ని వారి పని వారిని చేసుకోనివ్వండి. బీబీసీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన సంస్థ. తప్పుడు ప్రచారం విషయంలో బీబీసీకి కాంగ్రెస్‌కు పోలిక ఉంది' అని భాజపా జాతీయ ప్రతినిధి గౌరవ్‌ భాటియా వ్యాఖ్యానించారు. తమ కార్యాలయాల్లో ఐటీ విభాగం నిర్వహిస్తున్న సర్వేపై బీబీసీ స్పందించింది. 'ప్రస్తుతం ముంబయి, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులున్నారు. మేం వారికి సహకరిస్తున్నాం. ఈ వ్యవహారం త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశిస్తున్నాం' అని ట్వీట్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)