ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. రాజస్థాన్‌లోని దౌసాలో కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి ఈ రోడ్డును ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి జైపూర్ వరకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 246 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే ప్రారంభమైంది. ఇది ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశగా చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఢిల్లీ-జైపూర్ మధ్య ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించినట్లు విమర్శకులు చెబుతున్నారు. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేతో ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుందని అంటున్నారు. ఢిల్లీ-దౌసా వరకు నిర్మాణం పూర్తి చేస్తున్న ఈ మొదటి దశకు 12,150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు 1,386 కిలో మీటర్లు, ఢిల్లీలోని డీఎన్డీ ఫ్లైఓవర్ నుంచి ముంబైలోని జేఎన్పీటీ వరకు విస్తరించి ఉంది. ఎనిమిది వరుసలతో నిర్మితమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే. దీని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది పూర్తైతే ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం సగం తగ్గుతుంది. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న ప్రయాణం, 12 గంటలకు తగ్గుతుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే 93 పీఎం గతిశక్తి ఎకనామిక్ నోడ్స్, 13 పోర్టులు, 8 మేజర్ ఎయిర్‌పోర్టులు, 8 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను కలుపుకుని పోతుంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఓవర్ పాస్, అండర్ పాసులు నిర్మించిన ఆసియాలోని మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్‌వే ఇదే. దీని కోసం మొత్తంగా 25,000 లక్షల టన్నుల బిటుమెన్ ఉపయోగించారు. అలాగే శిక్షణ పొందిన 4,000 మంది ఇంజనీర్లు పని చేస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఏడాదికి 300 మిలియన్ లీటర్ల ఇంధనం, 800 మిలియన్ కిలోగ్రామ్ల కార్బన్ ఆదా అవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే వెంట అక్కడక్కడ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 120 కిలీమీటర్ల వేగ పరిమితికి అనుమతి ఉంటుంది. దేశంలో అత్యంత వేగవంతమైన రోడ్డు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద హెలిపాడ్లు, ట్రౌమా కేర్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశను ప్రారంభించిన ప్రధాని
February 12, 2023
0
Tags