తెలంగాణలో ఇప్పటికే కరెంట్ బిల్లుల్లో అడ్వాన్స్ కన్సంప్సన్ డిపాజిట్ (ఏసీడీ) బాదుడుతో జనం అల్లాడుతుంటే మరో కొత్త బాదుడుకు సర్కారు రంగం సిద్ధంచేసింది. ఫ్యూయెల్ కాస్ట్ అడ్జెస్ట్మెంట్ (ఎఫ్సీఏ) లేదా ఫ్యూయెల్ సర్ చార్జ్ అడ్జెస్ట్మెంట్(ఎఫ్ఎస్ఏ) పేరిట వినియోగదారులపై మరింత భారం మోపేందుకు రెడీ అవుతున్నది. ఇందుకోసం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (టీఎస్ఈఆర్సీ) రూల్స్ లో మూడో సవరణ చేస్తూ కొత్త రెగ్యులేషన్‌ను ప్రభుత్వం చేర్చింది. ఆదివారం అసెంబ్లీలో దానికి సంబంధించిన గెజిట్‌ను ప్రవేశపెట్టింది. ఆ రెగ్యులేషన్ ఏప్రిల్1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని గెజిట్‌లో పేర్కొంది. కరెంట్ కొనే ధర, వినియోగదారులకు అమ్మే ధర, కరెంట్అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ నియంత్రణ లేని అంశాలు (అన్‌కంట్రోలబుల్) అని పేర్కొంటూ.. కరెంట్ కాస్ట్‌కు తగ్గట్టు ఎఫ్సీఏ చార్జీలను విధించేలా డిస్కంలకు కొత్త రెగ్యులేషన్ ద్వారా స్వేచ్ఛను ఇచ్చింది. తద్వారా 3 నెలలకోసారి కరెంట్ కొనే ధర, నష్టాల ఆధారంగా యూనిట్‌కు 30 పైసల చొప్పున ఎఫ్‌సీఏను వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంతకుమించి వసూలు చేయరాదని రెగ్యులేషన్‌లో పేర్కొంది. ఎఫ్సీఏ చార్జీలు నెగెటివ్‌గా ఉంటే బిల్లు నుంచి ఆ మేరకు మినహాయించాలని వివరించింది. వ్యవసాయానికి ఇచ్చే ఎల్టీవీ(లో టెన్షన్ వోల్టేజ్) కరెంట్‌కు ఎఫ్సీఏ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ చార్జీలను సర్కారు నుంచి డిస్కంలు వసూలు చేసుకోవాలని తెలిపింది. ఒకవేళ సర్కారు ఆ బిల్లులను చెల్లించకుంటే వార్షిక ట్రూ అప్ చార్జీల్లో వాటిని ఫైల్ చేయరాదని పేర్కొంది. కమిషన్ ఆమోదించిన ట్రాన్స్మిషన్ (విద్యుత్ సంస్థలకు సరఫరా అయ్యే కరెంట్), డిస్ట్రిబ్యూషన్ (విద్యుత్ సంస్థల నుంచి వినియోగదారులకు సరఫరా అయ్యే కరెంట్) నష్టాలకు అనుగుణంగా ఎఫ్సీఏ చార్జీలను లెక్కించాలని సర్కారు పేర్కొంది. వినియోగదారులకు సరఫరా చేసిన మొత్తం కరెంట్ యూనిట్లు, వ్యవసాయ కనెక్షన్ల ద్వారా వాడిన యూనిట్లను కలిపి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసిన కరెంట్‌లో నష్టాల ఆధారంగా వాస్తవ కరెంట్ ధర, వాస్తవ కరెంట్ యూనిట్ల కొనుగోలును లెక్కించాలని సూచించింది. ముందుగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎఫ్సీఏ చార్జీలను వసూలు చేయరాదని పేర్కొంది. వినియోగదారులకు బిల్లు ఇచ్చేటప్పుడు ఎఫ్సీఏ చార్జీలను తప్పనిసరిగా మెన్షన్ చేయాలని రెగ్యులేషన్‌లో సర్కారు తెలిపింది. పరిమితికి మించి వసూలు చేయాల్సి వస్తే తప్పనిసరిగా కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందేనని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లనూ జతపరచాల్సి ఉంటుందని పేర్కొంది. అనుమతి లేకుండా పరిమితికి మించి ఎఫ్సీఏ చార్జీలను వసూలు చేస్తే వినియోగదారులు కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఒకవేళ వినియోగదారుడికి రీఫండ్ చేయాల్సి వస్తే ఎలాంటి పరిమితి లేకుండా ఆ చార్జీలను మొత్తం రీఫండ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త బాదుడు
February 13, 2023
0
Tags