రైల్వే బోర్డు ఛైర్మన్‌గా అనిల్‌కుమార్‌ లహోటి

Telugu Lo Computer
0


భారతీయ రైల్వే బోర్డు సీఈవో, ఛైర్మన్‌గా 1984 ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ లహోటి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఇంతకుముందు లహోటీ రైల్వే బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. రైల్వే మేనేజ్‌ మెంట్‌ సర్వీస్‌లో లెవెల్‌-17లో తొలుత ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. గ్వాలియర్‌లోని మాధవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌మెడల్‌తో డిగ్రీ సాధించారు. ఆ తర్వాత ఐఐటీ రూర్కీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. తన 36 ఏళ్ల ఉద్యోగ జీవితంలో సెంట్రల్‌, నార్త్‌, నార్త్‌ సెంట్రల్‌, వెస్ట్రన్‌, వెస్ట్ సెంట్రల్ రైల్వేస్‌తోపాటు రైల్వే బోర్డులో వివిధ హోదాల్లో పని చేశారు. సెంట్రల్ రైల్వే జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో కొన్ని నెలలపాటు పశ్చిమ రైల్వే జీఎం బాధ్యతలను కూడా చేపట్టారు. ఆయన జీఎంగా పని చేసినప్పుడు సెంట్రల్‌ రైల్వే రికార్డు స్థాయి రెవెన్యూను రాబట్టింది. ప్రత్యేకంగా టికెట్‌ చెకింగ్‌ డ్రైవ్‌లను నిర్వహించి.. ఆదాయానికి గండికొట్టకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ముంబయిలోని సబర్బన్‌ రైలు సర్వీసుల్లో ఏసీ పునరుద్ధరణకు లహోటీ ఎంతో కృషి చేశారు. ఆయన లఖ్‌నవూలో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రద్దీగా ఉండే ఘజియాబాద్‌-ప్రయాగ్‌రాజ్‌ మార్గానికి ప్రత్యామ్నాయంగా లఖ్‌నవూ-వారణాసి మార్గంలో రవాణాను మెరుగుపరచడానికి తీవ్ర కృషి చేశారు. ఆయన పని తీరుతో లఖ్‌నవూ డివిజన్‌లోని వివిధ స్టేషన్లలో పరిశుభ్రత, మౌలిక సదుపాయాకల్పన తదితర అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, లీడర్‌షిప్‌లో యూఎస్‌ఏ లోని పిట్స్‌బర్‌ కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయం, బకోని స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ మిలన్‌ ( ఇటలీ), ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌-హైదరాబాద్‌ తదితర చోట్ల అనిల్‌కుమార్‌ లహోటీ శిక్షణ తీసుకున్నారు. రైల్వే భూములు అభివృద్ధిపై హాంకాంగ్‌, జపాన్‌, యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లో అధ్యయనం చేశారు. ట్రాక్‌ టెక్నాలజీ, ట్రాక్‌ నిర్వహణ అభివృద్ధికి సంబంధించిన అంశాల కోసం వివిధ దేశాలను సందర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)