బ్యాగేజ్‌ను నిర్లక్ష్యంగా విసిరేసిన ఇండిగో సిబ్బంది !

Telugu Lo Computer
0


ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన సిబ్బంది విమానం నుంచి దించుతున్న బ్యాగేజ్‌ను నిర్లక్ష్యంగా వాహనంలోకి విసిరేశారు. తొలుత రెండు చిన్న బాక్స్‌లను ఎత్తి పడేశారు. ఆ తర్వాత పెద్ద బాక్సులను కూడా అలాగే వాహనంలోకి విసిరేశారు. కాగా, ఒక వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 'హాయ్ ఇండిగో, మీరు ప్రతి రోజూ విమానంలోని సామాగ్రి మొత్తాన్ని ఈ విధంగానే నిర్వహిస్తారా లేదా ఈ రోజు ప్రత్యేకంగా ఇలా చేశారా?' అని అందులో ప్రశ్నించారు. బుధవారం పోస్ట్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పలువురు నెటిజన్లు ఇండిగో సంస్థపై మండిపడ్డారు. తమ బ్యాగేజ్‌కు కూడా నష్టం జరిగిందని పలువురు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విమర్శించారు. మరోవైపు ఈ వీడియోపై ఇండిగో ఎయిర్‌లైన్‌ సంస్థ స్పందించింది. 'మిస్‌ గోయెల్, మీ ఫీడ్‌బ్యాక్‌కు ధన్యవాదాలు. షేర్ చేసిన వీడియోలోని పెట్టెలు కస్టమర్ల సామాను కాదు. ఇవి వేగంగా కదిలే, తక్కువ బరువున్న కంటైనర్‌లు. వేగంగా బట్వాడా చేసేందుకు పగలని విధంగా సిబ్బంది వీటిని ప్యాక్‌ చేస్తారు' అని తెలిపింది. అయితే ఈ వివరణపై నెటిజన్లు సంతృప్తి చెందలేదు. తమ బ్యాగేజ్‌కు వాటిల్లిన నష్టం గురించి పలువురు ఏకరవు పెట్టారు. ప్రతి విమానయాన సంస్థ కూడా బ్యాగేజ్‌ పట్ల ఇలాగే వ్యవహరిస్తుందని ఒకరు వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)