పెళ్లి పేరుతో దోచుకుంటున్న వగ (లేడీ) లాడి !

Telugu Lo Computer
0


తమిళనాడు లోని తాంబరం రంగనాథపురం ప్రాంతానికి చెందిన నటరాజన్ (25) అనే యువకుడు ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతడికి ముడిచ్చూరు రహదారిలోని బేకరీలో పనిచేస్తున్న అభినయ (28) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమ నుంచి పెళ్లి అనుకున్నారు. అనుకున్నట్టే నటరాజన్‌ తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఆగస్టు 29న అభినయను వివాహం చేసుకున్నాడు. కానీ, యువతి మాత్రం తన తల్లిదండ్రుల వివరాలు ఇవ్వలేదు. తన కుటుంబీకులతో గొడవలు పెట్టుకుని ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పింది. ఈ మాటలను నటరాజన్‌, అతడి కుటుంబ సభ్యులు నమ్మారు. పెళ్ళైన నెల రోజుల తర్వాత అభినయ కనిపించలేదు. చూస్తే ఇంట్లో నగలు, నగదు లేవు. డబ్బు, నగలు తీసుకుని అభినయ పారిపోయిందనే విషయం అర్థమైంది. ఆమె ఆచూకీ కోసం వెదికితే కనిపించలేదు. ఆమె ఉపయోగించే రెండు ఫోన్‌ నెంబర్లు పనిచేయలేదు. ఇక చేసేందేం లేక తాంబరం పోలీసులకు నటరాజన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సెమ్మంజేరిలో అభినయను అరెస్టు చేశారు. ఆమెను విచారించగా అప్పటికే ముగ్గురిని పెళ్ళాడి నగలు, నగదు దోచుకున్నట్లు వెల్లడైంది. ముందుగా మన్నార్‌కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్‌కుమార్‌ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే యేడాది తర్వాత శెంథిల్‌కుమార్‌ను విడిచిపెట్టింది. ముచ్చటగా మూడోసారి కేళంబాక్కం చేరుకుని ఓ యువకుడిని ప్రేమ పేరుతో బోల్తా కొట్టించి పెళ్ళి చేసుకుంది. అక్కడా అంతే. నగలు, నగదు దోచుకుని పరారై తాంబరం వెళ్లింది. తాంబరంలో నటరాజన్‭ను నాలుగో వివాహం చేసుకుని పోలీసులకు చిక్కింది. నటరాజన్ ఫిర్యాదు స్వీకరించి అభినయను అరెస్ట్ చేసి విచారించగా గతంలోని మూడు పెళ్లిల్లు వెలుగు చూశాయి. అభినయ వద్ద ఉన్న 32 సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభినయ మూడు, నాలుగో పెళ్లిల్లకు రెండో భర్త సెంథికుమార్‌ సహాయం చేశాడట. అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నటరాజన్‌ ఇంటి నుండి అభినయ దోచుకెళ్ళిన నగలు, నగదును రెండో భర్తకు ఇచ్చి అతడితో విలాసంగా గడిపినట్లు పోలీసులు కనుగొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)