ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్‌లను నేలమట్టం చేశారు. ఇంతలో సుప్రీంకోర్టు కలుగజేసుకొన్నది. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా వాళ్లు పెడచెవిన పెట్టారు. తమకు ఉత్తర్వులు అందలేదంటూ కూల్చివేత డ్రైవ్‌ను ముందుకు ఉరికించారు. ఈ క్రమంలో ఓ మసీదు గేట్లను బుల్డోజర్‌తో కూల్చివేసేందుకు యత్నించారు. అధికారుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం కూల్చివేతలను నిలిపివేస్తారా? లేదా? అంటూ మరోసారి తీవ్ర స్వరంతో హెచ్చరించింది. దీంతో చేసేదేమీలేక ఆ డ్రైవ్‌ను నిలిపివేశారు. బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారుల నిర్వాకమిది. హనుమాన్ జయంతి ఘర్షణల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురిలో బుధవారం చోటుచేసుకొన్న ఈ ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. జహంగీర్‌పురిలో గత శనివారం హనుమాన్ శోభాయాత్రలో అల్లర్లకు పాల్పడిన నిందితులు నివసిస్తున్న ఇండ్లు అక్రమమని, వాటిని కూల్చివేయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ఎన్డీఎంసీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. ఈ క్రమంలో బుధవారం అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను ఎన్డీఎంసీ అధికారులు ప్రారంభించారు. ఉదయమే పది బుల్డోజర్లు, వందలాది మంది అధికారులు, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నట్టు అప్పుడే సమాచార మిచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లను ఎలా కూల్చివేస్తారని కొందరు స్థానికులు ప్రశ్నించారు. ఎంతో కష్టపడి కట్టుకొన్న తమ ఇండ్లను కూల్చివేయవద్దని మహిళలు ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ, ఇవేమీ పట్టించుకోని అధికారులు డ్రైవ్‌ను మొదలుపెట్టారు. పదుల సంఖ్యలో ఇండ్లను, షాప్‌లను నేలమట్టం చేశారు. దీంతో కూల్చివేత డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయాల్సిందిగా ఆదేశాలివ్వాంటూ జమైత్ ఉలామా ఎ హింద్‌తో పాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఈ అంశంపై గురువారం విచారణ జరుపుతామని వెల్లడించింది. సుప్రీంకోర్టు రాతపూర్వక ఉత్తర్వులు అందలేదన్న సాకుతో.. అధికారులు కూల్చేవేతలను ఆపేందుకు నిరాకరించారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా దాదాపు రెండు గంటలపాటు డ్రైవ్‌ను అలాగే కొనసాగించారు. ఓ మసీదు గేట్లను బుల్డోజర్‌తో కూల్చివేసేందుకు యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. కూల్చివేత డ్రైవ్ ఇంకా నిలిపివేయలేదన్న విషయాన్ని న్యాయవాది దుష్యంత్ దేవ్ సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. వెంటనే కూల్చివేతలు నిలిపివేయాలంటూ మళ్లీ ఆదేశించింది. ఉత్తర్వులను ఎన్డీఎంసీ మేయర్, ఢిల్లీ కమిషనర్‌కు అందజేయాలని సూచించింది. ఇదే సమయంలో మసీదు మీదకు దూసుకొస్తున్న బుల్డోజర్‌కు సీపీఎం నేత బృందా కారత్ అడ్డుగా నిలిచారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులకు చూపించారు. దీంతో చేసేదేమీలేక.. అధికారులు కూల్చివేత డ్రైవ్‌ను నిలిపేశారు.
ఎన్డీఎంసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
April 21, 2022
0