జనవరి 25 వరకు చేపట్టిన సర్వే అంచనాల ప్రకారం యూపీలో సమాజ్ వాదీ పార్టీ గెలవబోతున్నది. ప్రముఖ సెఫాలజిస్ట్ మూర్తి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆత్మసాక్షి గ్రూప్ కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ సర్వేలు నిర్వహిస్తుండటం తెలిసిందే. ఆ సంస్థ అంచనాలు చాలా సార్లు నిజమైన నేపథ్యంలో తాజా ఫలితాలకూ ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆత్మసాక్షి తాజాగా ప్రీపోల్ సర్వే నిర్వహించి, వాటి ఫలితాలను వెల్లడించింది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్తుత 2022 ఎన్నికల్లో మాత్రం దాదాపు డీలాపడిపోయి, ఈసారి 133 నుంచి 138 సీట్లకే పరిమితం అవుతుందని ఆత్మసాక్షి సర్వేలో వెల్లడైంది. పూర్వాంచల్, బుందేల్ ఖండ్, పశ్చిమ యూపీ, అవధ్ అనే తేడాల్లేకుండా అన్ని రీజియన్లలో బీజేపీ గణనీయంగా సీట్లు కోల్పోనుంది. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో సమాజ్ వాదీ పార్టీ తన పాత పట్టును తిరిగి సాధించనుంది. అయితే ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కు 39శాతానికిపైగా అప్రూవల్ రావడం గమనార్హం. ఆత్మసాక్షి ప్రీపోల్ సర్వే ఫలితాల ప్రకారం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి 221 నుంచి 228 సీట్లు దక్కనున్నాయి. 42.5 శాతం అప్రూవల్ తో అఖిలేశ్ యాదవ్ సీఎం కాబోతున్నారు. ఈ సారి బీజేపీకి 34.5 శాతం ఓట్లు దక్కతాయని, సమాజ్ వాదీ పార్టీకి మాత్రం 38 శాతం ఓట్లు లభిస్తాయని ఆత్మసాక్షి అంచనా వేసింది. యూపీలో బీజేపీ ఓటమికి ప్రధానంగా రైతు ఉద్యమం, అధిక ధరలు, నిరుద్యోగ సమస్య కారణాలుగా ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, నిరుద్యోగుల ఆగ్రహం, పెట్రోల్, నిత్యావసరాలు, సాగు చట్టాలపై రైతుల పోరాటం బీజేపీ పుట్టిముంచనున్నాయి. ప్రస్తుత యూపీ ఎన్నికల ప్రచారంలో కాస్త వెనుకబడ్డ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి సీట్ల సాధనలోనూ అదే తీరు కనబరుస్తారని, బీఎస్పీకి ఈసారి 17 నుంచి 21 సీట్లు మాత్రమే వస్తాయని ఆత్మసాక్షి ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొద్దిగా పుంజుకొని 16 నుంచి 20 సీట్లు సాధిస్తుందట. ఇతరులకు గరిష్టంగా 9 సీట్లు దక్కే అవకాశముంది. పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధిస్తుందని ఆత్మసాక్షి సర్వేలో వెల్లడైంది. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరఖండ్, గోవా రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ వశం కాబోతున్నట్లు సర్వే తెలిపింది.