విశాఖపట్నం లోని జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన ఎన్.అన్నపూర్ణ తండ్రి నౌకాదళంలో పనిచేసి కొన్నేళ్ల కిందట మృతి చెందారు. పెన్షన్ ప్రయోజనాల కోసం అన్నపూర్ణ నేవీ అధికారులను సంప్రదించగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని డెత్ సర్టిఫికెట్ ఆధారంగా అతనికి భార్య, పిల్లలు ఉన్నట్టయితే వారి వివరాలను నిర్ధారిస్తూ అధికారికంగా ఇచ్చే ధ్రువీకరణ పత్రం) ఉండాలన్నారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ మహిళ గత నెల 24న మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి రెండు రోజులు తిరిగినా పని కాకపోవడంతో నేరుగా డిప్యూటీ తహసీల్దార్ రవి కుమార్ ను కలిసింది. దీంతో ఆయన పని ఈజీగా అయిపోతుందని.. తాను చెప్పినట్టు చేస్తే సులువుగా ఫ్యామిలీ సర్టిఫికెట్ వస్తుందని ఆమెకు భరోసా ఇచ్చి కండిషన్లు పెట్టాడు. డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ డిమాండ్ మొదట అన్నపూర్ణ పట్టించుకోలేదు. దీంతో ఈ నెల నాలుగో తేదీన ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఇక చేసేది ఏమీ లేక ఆమె తిరిగి ఈ నెల 11న సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసి, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్‌ను కలిశారు. ఆ సర్టిఫికెట్ వస్తే అన్నపూర్ణకు నెలకు దాదాపు రూ.1.1 లక్షలు చొప్పున... ఇంతవరకూ 50-70 లక్షలు అందుతుందని. కాబట్టి, తనకు ఆరు లక్షలు లంచంగా ఇవ్వాలి అని రవి కుమార్ డిమాండ్ చేశాడు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని ఆమె చెప్పగా, చివరికి 4.5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అడ్వాన్సుగా 60 వేల రూపాయలు, సర్టిఫికెట్ జారీచేసిన తరువాత మిగిలిన మొత్తాన్ని నగరంలో ఓ ప్రముఖ హోటల్ దగ్గరకు వచ్చి స్వయంగా ఇవ్వాలని షరతు విధించాడు. దీంతో ఆమె అదేరోజు తెలివిగా ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం సోమవారం బాధితురాలితో డీటీ రవికుమార్‌కు ఫోన్ చేయించి, అడ్వాన్స్ మొత్తాన్ని పట్టుకుని సిద్ధంగా వున్నానని చెప్పించారు. అతను ప్రొటోకాల్ డ్యూటీ నిమిత్తం ఎయిర్‌పోర్టుకు వెళుతున్నానని, తాను చెప్పిన హొటల్ దగ్గరకు వచ్చేయాలని సూచించాడు. అన్నపూర్ణ కారులో అక్కడకు వెళ్లి డబ్బులు అందజేయబోగా ఏమైందో ఏమీ కానీ.. ఇక్కడ వద్దని.. తనకు కరాస పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఓ మంచి ఫ్లాట్ ఉందని.. అక్కడ అయితే ఎలాంటి సమస్య ఉండదని చెప్పి.. శ్రీవెంకటేశ్వర అపార్ట్‌మెంట్ వద్దకు వెళదామని అక్కడ నుంచి బాధితురాలి కారులోనే అక్కడకు తీసుకెళ్లాడు. ఆ ఫ్లాట్ కూడా.. ఆయనగారు సహజీవం చేస్తున్నదని తెలిసింది. భార్యతో మనస్పర్థలు కారణంగా.. విడిగా ఉంటున్నాడు. కరాసలో ఓ ఫ్లాట్ కొని అక్కడ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ ఫ్లాట్ లోనే ఈ వ్యహారం సెటిల్ చేసుకుందామని తీసుకెళ్లాడు. అక్కడ లంచం తీసుకుంటుండగా వారిని అనుసరిస్తున్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రవికుమార్‌ను పట్టుకున్నారు. అతను నివాసం వుంటున్న ఫ్లాట్‌లోకి తీసుకువెళ్లి సోదాలు నిర్వహించగా అనధికారికంగా దాచిన మూడున్నర లక్షల రూపాయలు లభ్యమయ్యాయి. ఫ్లాట్ ఉన్న సౌకర్యాలు.. అతడి వ్యవహారం ఆధారంగా ఆయన భారీగానే అక్రమ ఆస్తులు కూడగట్టాడని భావిస్తున్నారు. దీంతో రవికుమార్ ఇంటితోపాటు కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ లక్షణమూర్తితోపాటు సీఐలు పాల్గొన్నారు.
డిప్యూటీ తహసీల్దార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ
December 14, 2021
0