సంపన్న మహిళలే టార్గెట్ !

Telugu Lo Computer
0


శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌ దంపతులు. పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లా్లో నివాసం ఉంటున్నారు. శిల్పా చౌదరి తనను తాను సినీ నిర్మాతగా, తన భర్తను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకొంటారు. తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ టాలీవుడ్‌ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ.. ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయని నమ్మిస్తుంటుంది. ఇలా పలువురి నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. లాభాలు ఏవని అడిగితే.. ఏళ్లు గడుస్తున్నా వాటి ఊసెత్తకుండా దాటవేస్తూ, బెదిరింపులకు సైతం దిగడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరూ కలిసి తాజాగా సహేరి అనే సినిమా కూడా తీశారు. కానీ, అది విడుదల కాలేదు. తమ డాబుదర్పాలతో నగరంలో వ్యాపారవర్గాలకు చెందిన సుమారు 20 మంది మహిళలతో శిల్పాచౌదరి తరచూ కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసేది. ఆమె ఉచ్చులో చిక్కిన మహిళలకు లాభాల ఆశ చూపి భారీగా డబ్బు వసూలు చేసింది. లాభాలు వస్తే వాటాలు ఇస్తామని, నష్టాలు వస్తే తీసుకున్న డబ్బుకు వడ్డీ కలిపి ఇస్తానంటూ అందర్నీ నమ్మించింది. నిజమని భావించి పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి రూ.1.05 కోట్లు, మంచిరేవులకు చెందిన రోహిణి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చారు. నెలల గడుస్తున్నా అసలు, వడ్డీ చేతికి రాకపోవటం, ఫోన్లకు స్పందించకపోవడంతో దివ్యా రెడ్డి ఈనెల 8న శిల్పాచౌదరి ఇంటికి వెళ్లారు. తానిచ్చిన డబ్బు తిరిగివ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. శిల్ప తన వద్దనున్న బౌన్సర్లతో ఆమెను బెదిరించింది. దీంతో బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు శుక్రవారం శిల్ప దంపతులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున న్యాయస్థానం దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)