హన్మంతుడు ఎ౦దుకట?

Telugu Lo Computer
0

 




‘’ బాబాయ్! గుడి లో హనుమంతుడి విగ్రహం అవసరం లేదు ఆర్డర్ కాన్సిల్ చేసేద్దాం ‘’అన్నాడు వె౦కటేష్.

“ మతి పోయిందా మీకు ! హనుమ౦తుడు లేకుండా రాములోరి గుడేటి? ” అన్నాడు. వెంకన్న. కాలని పెద్దల్లో ఆయనొకడు.
‘’ అదే చెప్పేది , రాములోరి దగ్గర సీతమ్మ చాలు కదా! బ౦టు హన్మంతుడు ఎ౦దుకట? ‘’’ అన్నాడు, మల్లేషు.
అదొ చిన్న కొలనీ. దాని కెదురుగా ఫకీరు దిబ్బ . ఆ దిబ్బ మిద మామిడి చెట్టుకింద రాములోరి ఫోటో పెట్టుకుని వో ఫకీరు వుండేవాడు.
ఏడాది క్రితం ఫకీరు పోయాడు.ఆ ఫోటో మిగిలింది. కాలననీ జనానికి ఆ దిబ్బ ఇప్పుడు వో రచ్చబండ. కుర్రకారు సరదాలకు, వ్యసనాలకు తద్వారా వచ్చే, గొడవలకు కూడా అదే వేదిక అయింది.
కాలననీ పెద్దలు ఆ౦దోళన పడ్డారు. ఆ దిబ్బమీద రాములోరికి ఓ మందిరము కట్టాలని , అప్పుడే వెధవ పన్లు, గొడవలు తగ్గిపోతాయని తీర్మానం చేసారు.
ఆపనికి కుర్రకారుని ఒప్పించి వారికే పని అప్పగించారు. విగ్రహాలకు డబ్బు ఇస్తామని, కొ౦దరు మోతుబరులు ముందుకు వచ్చారు.
రాజస్థాన్ లోని, మకరానా వాళ్ళతో మాట్లాడి విగ్రహాలు కొనే భాద్యత మూర్తికి అప్ప చెప్పారు.విగ్రహాలకు కొంత అడ్వాన్స్ వసూలు చేసి పంపారు కూడా. వుద్యోగం లో రిటైరైన మూర్తి, అక్కడకు దగ్గరలో తన కొడుకు అపార్ట్ మెంట్ లో వుంటున్నాడు.
కాలని కుర్రాళ్ళు హుషారుగా పని మొదలెట్టారు . పునాది పడి, పిల్లర్స్ అయ్యేసరికి, వసూలైన డబ్బు అయిపోయింది. మళ్లి చందాలు మొదలెట్టారు..అతికష్టం మీద స్లాబ్ లేపారు.ఇంకా పని వుంది. కానీ సిమె౦ట్ బాకి చాలా వుండి పోయింది. ఏదో రకంగా విగ్రహ స్తాపన చేసేసి, మిగిలిన పని నెమ్మదిగా చేసుకుందాం అనుకున్నారు. గుడికి మార్బల్స్, రంగులు చాలా చాలా ప్లాన్లు వున్నాయ్ వాళ్ళ దగ్గర.
ఇంతలో మళ్ళి ఏదో సమస్య. ఓ దాత డబ్బులివ్వనన్నాడు. అందుకే ఈమీటింగ్.
‘’పది రోజుల్లో రామనవమి పెట్టుకుని, విగ్రహం వద్ద౦టారేమిటి!ఇప్పుడా గోల మీ కెందుకు.
అయినా మాణిక్యం సేటు ఆ౦జనేయుడి ఇగ్రహానికి సొమ్ము ఇచ్చి , పూజలో
కూసు౦టానన్నాడుగా ‘’ అన్నాడు నర్సింహులు విసుగ్గా. గుడి వ్యవహారాలూ చూసేది నర్సి౦హులే మరి.
‘’ సేటు డబ్బులు ఇవ్వడట.పూజలో కూచోడట. ‘’అన్నారు కుర్రాళ్ళు.
‘’ మాట తప్పేవాడు కాడే సేటు.’’ అన్నాడు. వెంకన్న.
‘’ సేటు భార్య పూజలో కూచోనంది.మీ సేటుకు రెండు చిన్నిళ్ళు,సంసారాలు ఉన్నాయ్. అలా౦టోడు రాములోరి పూజ ఎలా సేస్తాడు? తప్పు కదా! చేస్తే, కళ్ళు పోవా? కాదని పూజలో కూర్చుంటే, సేటు కాళ్ళిరగ్గొడ్తా! అంది. సేటు డబ్బులు ఇవ్వనన్నాడు.’’ అన్నాడో కుర్రాడు.
‘’ హనుమయ్య రాముడి దగ్గరే వు౦టాడు గదా. లేకుండా మందిరం ఏమిటి?’’ అoది. సత్తెమ్మ. ఆవిడ కు ఎర్రచెరువు కాడ కిళ్ళీ కొట్టుoది.
‘’ రాముడంటే పెట్టుకున్నాడు హనుమయ్యను, ఇప్పుడేవడు చూస్తున్నాడు పై వాళ్ళను, మన చి౦తల్లి, ౩౦ ఏళ్ళు పనిచేసాడు, ఆ నాయుడి ఇంట్లో
కాలిరిగితే....ఇంటికి పొమ్మన్నారు. ఎవరూ పట్టించు కోలేదు.
సారూ! గుడిలో రాముడు, లక్ష్మణుడు, సీత చాలు మనకు, ఆ రాజస్థాన్ వాళ్ళకు మూడు విగ్రహాలు చాలని చెప్పెయ్యండి.‘’
అన్నాడు బోస్ ,మూర్తి కేసి తిరిగి. బోస్ కుర్రాళ్ళ నాయకుడు.
మూర్తి ఈ తరం ఆలోచనలన్నీ ఆశ్చర్యంగా వింటున్నాడు. ఆంజనేయుడు రాముడి కుటు౦బ౦ లోకి రాడనీ,గుడిలో అవసరం లేదని యువ తరం తేల్చింది.
మకరానా వాళ్లకి, మూర్తి అదే విషయ౦ చెప్పాడు, వాళ్ళు ఆశ్చర్య పోయి, తర్వాత గొణుక్కుని, సరే అన్నారు.
మళ్ళి రెండు రోజుల్లో కాలని మీటి౦గ్ పెట్టారు.
ఈ సారి కాలనీ ఆడోళ్ళ౦తా తిరగ బడ్డారు.
‘ ఊరవతల కాలనీ, ఆంజనేయుడు లేకపోతె ఎలా? చెడుపులు, చిల్లంగులు, భూతాలూ, గాలులు నుండి, కాసేది హనుమయ్యే...కదా! కుర్ర సన్నాసులు ఏదో వాగితే.....ఊ... అనేయ్యడమేనా ‘ అని, పెద్దలమీద ఎగిరారు.
హనుమ రాక పొతే, ఇళ్ళల్లో పొయ్యి వెలగదు జాగ్రత్త ! అని వాళ్ళ హక్కులు చూపించి బెదిరించారు.
మళ్ళి వేడిగా వాడిగా చర్చలు జరిగేయి. డబ్బు లేదు మరి, ఎలా?
ఆలోచించి ఆలోచించి హనుమంతుడిని వుంచాలని బదులుగా , లక్ష్మణుడిని తీసేద్దామన్నారు.
రాముడు సీత, హనుమ౦తుడు చాలు అన్నారు, కుర్ర కారు.
పెద్దలు నోరెళ్లబెట్టారు.ఒప్పుకోలేదు.
” రామ లక్ష్మణులు శరీరాలు వేరైనా ప్రాణం ఒకటే. మొదటినుండి, చివర దాకా కలిసే వారు వున్నారు . డబ్బు ఎలాగైనా సర్దాలి గాని, వాళ్ళను విడగొట్టడం పాపం, ‘ అన్నాడు వె౦కన్న.
‘ ఆ కాలం వేరు... ఈ కాలం వేరు. అన్నేమిటి , తమ్ముడేమిటి, యాభై ఏళ్లుగా కలసి వున్నవాళ్ళు , మన నర్సి౦హ బాబాయ్, కో౦డయ్య బాబాయ్ విడిపోలేదా, వాళ్లిప్పుడు మాట్లాడుకుంటున్నారా... లేదే..? ‘ అన్నాడు, వె౦కటెష్, మూల మౌన౦గా కూర్చున్న కొ౦డయ్యను చూస్తూ...
నర్సి౦హ మనసు బాధగా మూలిగింది ఈ మాటలకు. పాత పేపర్లు, స్క్రాప్ వ్యాపారం వాళ్ళ అన్నదమ్ములది. ఒకటే మాట, ఒకటే కొట్టు గా సాగింది, మొన్నటివరకు.
ఏదో మాట మీద మాట వచ్చి, విడిపోయారు. మాటల్లేవు. మాటాడాలనే వుంది. ఏదో అహంభావం.
‘’ ఇప్పుడవన్నీఎందుకు? విగ్రహం విషయం చూడకు౦డా? ‘’ అన్నాడు వెంకన్న.
‘ మాకు మాత్రం హనుమయ్య కావలసిందే. ’ అన్నారు మహిళా సంఘం అంతా ఏకగ్రీవంగా.
లక్ష్మణుడి విగ్రహం వద్దు , బదులుగా హనుమంతుడి విగ్రహం పంపమని
చెప్పమన్నారు, మూర్తి తో.
ఇదంతా కొరుకుడు పడడం లేదు మూర్తికి. ఈ యువత చాలా త్వరగా , సులువుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుడి ఖర్చు చాలా వుందిట. అందుకని, విగ్రహాల ఖర్చు తగ్గి౦చాలట. ఈ సారి సమస్య వస్తే...’ సీతమ్మ కూడా వద్దు, రాముడొక్కడే చాలు ‘ అనేలాగున్నారు.
విగ్రహాల కోసం గుడి కడుతున్నారా! గుడి కోసం విగ్రహాలు తెస్తున్నారా?
విసుక్కుంటూనే ఫోన్ కలిపాడు మూర్తి మకరానా వారికి. వాళ్లకూ చికాకు వేసింది.
‘ ఒకసారి హనుమంతుడు వద్దు అంటారు, మరోసారి లక్ష్మణుడు వద్దు అంటారు. ఈ వేళాకోళం ఏమిటి మాతో అని కోప్పడ్డారు.అన్ని విగ్రహాలు రడీ అయ్యాయి. అయినా మీరు వద్దన్నారని, హన్మంతుడిని, మరోకరికి అడ్జస్ట్ చేసేసాము. లక్ష్మణుడిని ఒక్కడినే ఎవరూ తీసుకోరు. సీతా రామ లక్ష్మణులను పంపుతున్నాము .
కావాలంటే, హనుమంతుడిని, వీలుని బట్టి తయారు చేసి తర్వాతెప్పుడో పంపుతాం. ‘ అన్నారు.
‘ అబ్బే అలా కుదరదు . ఇప్పుడే కావాలి హనుమ ‘ అని, వత్తిడి చేస్తే....
వాళ్ళు మళ్ళి ఫోన్ చేసి, వో విగ్రహం వుందని, ఎవరో బ్రహ్మచారుల సంఘం ఆర్డర్ చేసి, తర్వాత కాన్సిల్ చేసారని, కాకపొతే... అది హనుమంతుడు నిలబడి వున్న విగ్రహమని, కావాలంటే పంపుతామని అన్నారు.
మళ్ళి మీటింగ్. చర్చలు. కూర్చున్న హనుమ కావాలని, కొందరు, నించుని వుంటే తప్పే౦టని, యువతరం వాదనలు మొదలెట్టారు.
వినాయక నవరాత్రులలో, నిలబడి, కూర్చుని, క్రికెట్ ఆడుతూ, బస్కీలు తీస్తూ, రకరకాల వినాయకులు వుంటారని, అందువలన ఆంజనేయుడు నిలబడితే తప్పు లేదని, అసలు సీతా రామ లక్ష్మణులు నిలబడి వుండగా, హనుమ కూర్చుంటే తప్పని, నిలబడ్డమే కరక్ట్ అని, కుర్రకారు తేల్చారు.తక్కువైన డబ్బు ఎలా సర్దాలా అని తర్జన బర్జనలు పడ్డారు. కిందా మీదా పడ్డారు.
రాత్రి 11 అయినా నిద్ర పట్టలేదు మూర్తికి.
నీడలా వెన్నంటే వుండే లక్ష్మణుడు, ప్రాణం ఇచ్చే భరత శత్రుగ్నులు, కష్టసుఖాలలో తోడుగా వుండే సీతమ్మ,ఏకపత్నివ్రతుడైన రామయ్య, ఆదర్శ కుటుంబానికే ప్రతీకలు.
ప్రపంచాన్నే కుటుంబంగా భావించిన రాముడికి, మందిరం లేని గ్రామం భారతావని లో వుండదు.
అటువంటి రామయ్యకు తమ్ముడు లేకుండా, నమ్మిన సేవకుడు లేకుండా కళ్యాణమా!
పెద్దలను వారి ఆలోచనలను పట్టి౦చుకోకు౦డా వంటరి బ్రతుకులు బతికే ఈ యువతరం రాముడిని కూడా వంటరి వాడిని చేసేస్తో౦దా!
ఏమిటి వీరి ఆలోచనలు, పోకడలు. ఎక్కడికి పోతోందీ యువతరం?
ఏమిటిది రామయ్యా! వానరులతో వారధినే కట్టించిన వాడివి, మానవులతో మందిరం కట్టించ లేక పోతున్నావా! మాలో మానవత్వం, మమత కరువైదని కోపమా!
రాత్రంతా , నిద్ర పోకుండా మంచం మీద దొర్లుతున్న భర్తను, అతని ఆవేదనను గ్రహించింది, శైలజ . మూర్తి అన్ని విషయాలు శైలజకు చెప్తూ వుంటాడు.
ఉదయ౦ పది గంటలకు, US నుండి, మూర్తి అన్న కొడుకు గౌతమ్ వీడియో కాల్ చేసి మూర్తితో మాట్లాడాడు.
సాయ౦త్ర౦ కాలనీ వైపు ఉత్సాహంతో నడుస్తున్న మూర్తికి, గౌతమ్ గుర్తుకు వస్తున్నాడు. తన కళ్ళ ముందు పెరిగిన బిడ్డ ఎంత ఎదిగి పోయాడు. ఎంత బాగా చెప్పాడు.
‘ బాబాయ్ ! పిన్ని ఫోన్ చేసి విషయాలు చెప్పింది. ఎందుకు బాబాయ్ , ఆందోళన?
మా తరం ఎప్పుడూ రాముడిని మర్చిపోలేదు. మారుతున్న అవసరాలు, ఆర్ధిక పరిస్తితులు, అవకాశాలు మా తరాన్ని, బౌతికంగా మీ తరానికి దూరం చేస్తున్నాయి , తప్ప, స్వార్ధం, నిర్లక్ష్యం కానేకాదు. మానసికంగా మేమంతా ఒకటే . అదే ప్రేమ, అదే అనుబంధం.
బాబాయ్! నేను తమ్ముళ్ళు వంశి , చైతన్య లతో మాట్లాడాను! రామ మందిరం గురుంచి నీ ఆవేదన ను వాళ్ళు గ్రహించారు. అర్ధం చేసుకున్నారు. ఒక్క మాటగా నన్ను , నీతో చెప్పమన్నారు.
రాముడి కళ్యాణానికి లక్ష్మణుడు , హనుమ వస్తున్నారని, చెప్పండి.
అంతేకాదు, లక్ష్మణుడు తనతో పాటు భరత శత్రుఘ్నులుని కూడా కళ్యాణానికి తీసుకు వస్తున్నాడని మీ నర్సింహకి, వె౦కన్న , మల్లెసు, బోస్ లకి చెప్ప౦డి. ఆ విగ్రహాలకు కావలసిన సొమ్ము, మా అన్నదమ్ములం ముగ్గురూ భరిస్తామని చెప్పండి.
అన్నదమ్ములయిన నర్సి౦హ, కొండయ్య కక్ష్ల, కార్పణ్యాలు మరచి ఒక్కటిగా, కుటుంబాలతో కలసి, కళ్యాణం చేయిస్తే మన కోదండ రాముడు చాలా ఆన౦దిస్తాడని చెప్పండి.మన రాముడు దయా సాగరుడని వాళ్ళని, క్షమిస్తాడని, చెప్పండి. మీ సారధ్యం లోనవమి నాడు, వైభవంగా జరిగే ఆ కళ్యాణాన్ని, మేము online లో చూస్తా౦.’’
కాలని లోకి ప్రవేశి౦చిన మూర్తి నరశింహ ఇంటికి వెడుతూ, దిబ్బ మీదకు చూసాడు.
నీరెండలో ప్రకాశిస్తున్న మందిరం లో మామిడాకుల తోరణాలతో, మంగళ వాయి ద్యాల మధ్య కుటుంబం తో కళ్యాణ రాముడు, కొలువై జీవ కోటిని ఆశిర్వదిస్తున్నట్లు, అనిపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)